Friday, 1 December 2017

నవంబర్ 2017 ఎకానమీ

15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నవంబర్ 22న నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉన్నాయి.


ఐటీ చట్టాల సమీక్షకు అత్యున్నత స్థాయి కమిటీఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది. 
కన్వీనర్‌గా అరవింద్ మోదీ ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్‌మోదీ కన్వీనర్‌గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్‌ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది? అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు దేశీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైక్ యూజర్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్ సర్వీసులు పొందొచ్చు. 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. 


న్యూఢిల్లీలో సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సుప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సైబర్ ముప్పుని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో నవంబర్ 23, 24 తేదీల్లో 5వ సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు (Global conference on cyber space) జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా పాల్గొన్నారు.


దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం తపాలా బిళ్లల సేకరణ చేసేవారికి కేంద్రప్రభుత్వం ఉపకార వేతనం (స్కాలర్‌షిప్) అందించనుంది. పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు వారిలో తపాలాబిళ్లల సేకరణ అలవాటును పెంచాలని నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఎంపికై న వారికి రూ.ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది. ఈ మేరకు దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో స్పర్శ్ (ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్)ను స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీగా పేర్కొంది. 
 

సామాజిక సేవకు సునీల్ మిట్టల్ 7,000 కోట్ల విరాళంప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది. ఈ మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలో మిట్టల్ కుటుంబ సభ్యులకు ఉన్న మూడు శాతం వాటా కూడా విరాళంలో భాగమే. ఈ మొత్తాన్ని తమ కుటుంబం తరఫున ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ఇవ్వనున్నట్టు సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. తన సోదరులు రాకేశ్, రాజన్‌తో కలసి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉచితంగా విద్యనందించేందుకు సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మిట్టల్ చెప్పారు. ఉత్తర భారతంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. విరాళంలో అధిక భాగం యూనివర్సిటీ ప్రాజెక్టుపైనే వెచ్చించనున్నామని, కొంత మేర ఇప్పటికే నిర్వహిస్తున్న సత్యభారతి స్కూళ్ల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు. 


సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి : హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వెయి్య గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించింది. ఈ మేరకు 16 రాష్ట్రాల పరిధిలోని వెయి్య గ్రామాల్లో పది లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించనుంది. హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(హెచ్‌ఆర్‌డీపీ)లో భాగంగా రెండున్నరేళ్ల కాలంలో 750 వెనకబడిన గ్రామాలకు సాధికారత కల్పించామని బ్యాంకు పేర్కొంది. హెచ్‌ఆర్‌డీపీలో భాగంగా విద్య, నీరు, పారిశుద్ధ్యం, అందరికీ బ్యాంకింగ్ సేవలు తదితర రంగాల్లో మెరుగుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది. 


ఎస్‌బీఐ ‘యోనో’ యాప్‌ను ఆవిష్కరించిన అరుణ్ జైట్లీ డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 24న ఈ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ-కామర్స్ సంస్థలతో ఎస్‌బీఐ చేతులు కలిపింది. 
 

భారత్ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించిన ఎస్ అండ్ పీ భారత్‌కు ఇస్తున్న రేటింగ్ ‘బీబీబీ-మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది.
2007 వరకూ ఎస్‌అండ్‌పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్‌అండ్‌పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్‌అండ్‌పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. 


మహిళా సాధికారతకు అమెజాన్ ‘సహేలి’మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ‘సహేలి’ అనే కార్యక్రమాన్ని నవంబర్ 28న ఆవిష్కరించింది. మహిళలు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌‌స, గృహాలంకరణ ఉత్పత్తులు విక్రయించేందుకు వీలుగా సహేలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీతో రెఫరల్ ఫీజు, ఉత్పత్తుల ఉచిత చిత్రీకరణ, ఖాతా నిర్వహణకు మహిళా వ్యాపారులకు తోడ్పాటునిస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ వుమెన్ అసోసియేషన్, ఇంపల్స్ సోషల్ ఎంటర్‌ప్రైస్ సహకారంతో అమెజాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.


పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రారంభంపేటీఎం పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 28న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టెక్నాలజీ దేశ బ్యాంకింగ్ రూపురేఖలను మార్చేసి నగదు స్థానాన్ని భర్తీ చేస్తోందన్నారు. ఈ బ్యాంక్ కార్యకలాపాలను 2017 మేలో ప్రయోగాత్మకంగా చేపట్టగా, ఇప్పుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ సంస్థ కనీస బ్యాలెన్‌‌సలేని, ఉచిత ఆన్‌లైన్ లావాదేవీలను ఆఫర్ చేస్తోంది.


పప్పుధాన్యాల ఎగుమతికి కేంద్రం అనుమతి రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. 
మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016-17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి.
కేబినెట్ నిర్ణయాలు...
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-అర్బన్) పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్ ఏరియాను పెంచేందుకు అనుమతి.
  • జీఎస్టీలో భాగంగా నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏర్పాటుకూ ఆమోదం. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చు. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీబీఈసీ చైర్మన్ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది.
  • ఐసీడీఎస్‌లో నాలుగు పథకాల్ని నవంబర్ 2018 వరకూ కొనసాగించాలని నిర్ణయం. ఇందులో అంగన్‌వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి.


తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 126 స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి భారత్ 7,170 డాలర్ల ఆదాయంతో 126వ ర్యాంకులో నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఈ మేరకు నవంబర్ 18న తాజా గణాంకాలు విడుదల చేసింది. గతేడాది(2016) ఐఎంఎఫ్ గణాంకాల్లో భారత్ 6,690 డాలర్ల తలసరి ఆదాయంతో 127వ ర్యాంకులో ఉంది. 
కొనుగోలు శక్తి ఆధారంగా(పర్చేజ్ పవర్ ప్యారిటీ) ప్రపంచంలోని 200 దేశాల జీడీపీలను లెక్కలోకి తీసుకొని ఐఎంఎఫ్ ఈ ర్యాంకింగ్‌‌సను నిర్ణయించింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం’ నివేదికలో భాగంగానే ఈ జాబితాను కూడా ప్రవేశపెట్టింది. ర్యాంకింగ్స్ లో 1,24,930 డాలర్ల తలసరి ఆదాయంతో ఖతార్ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2,3 స్థానాల్లో మకావూ(1,14,430 డాలర్లు), లగ్జెంబర్గ్(1,09,190 డాలర్లు) నిలిచాయి. 
బ్రిక్స్ దేశాల్లో రష్యా తలసరి ఆదాయం 27,900 డాలర్లు, చైనా 16,620 డాలర్లు, బ్రెజిల్ 15,500 డాలర్లు, దక్షిణాఫ్రికా 13,440 డాలర్లతో భారత్‌కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి. 
పర్చేజ్ పవర్ ప్యారిటీ(పీపీపీ) అంటే..: ఏదైనా ఒక దేశం కరెన్సీని మరో దేశం కరెన్సీలోకి మార్పిడి చేసినప్పుడు మొదటి దేశంలోని నిర్ధేశిత కరెన్సీతో ఏ విధంగా వస్తు, సేవల పరిమాణం లభిస్తుందో.. అదే విధంగా రెండో దేశంలో కూడా నిర్ధేశిత మొత్తం(కరెన్సీని మార్పిడి చేయడం ద్వారా లభించే సొమ్ము)తో అంతే పరిమాణంలో సేవలు, వస్తువులను కొనుగోలు చేయగలగడం. 


ఆరేడు నెలల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణంఅక్టోబర్‌లో హోల్‌సేల్ ధరలు పెరిగాయి. సెప్టెంబర్‌లో 2.6 శాతం ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) అక్టోబర్‌లో 3.59 శాతానికి పెరిగింది. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. గత ఏడాది ఇది 1.27 శాతం వద్ద ఉండటం గమనార్హం. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ గణాంకాలను కేంద్ర గణాంక కార్యాలయం నవంబర్ 14న విడుదల చేసింది.

జీఎస్‌టీ అక్రమాల నిరోధానికి ప్రాధికార సంస్థ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) శ్లాబ్‌ల పరిధి తగ్గించినా ఆ ప్రయోజనాలు వినియోగదారులకు పంచకుండా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల అక్రమాలను అరికట్టడానికి జాతీయ అనుచిత లాభ నిరోధక ప్రాధికార సంస్థ (నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ) ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది. 178 వస్తువులను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతంలోపు పన్ను పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూడటానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

రెస్టారెంట్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు వస్తు, సేవల పన్ను శ్లాబుల్లో జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది. 28% పన్ను భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు 28% పన్ను పరిధిలో 228 వస్తువులుండగా వాటిని 50కి కుదించింది. అంటే 178 వస్తు, సేవలపై పన్నును 18% పరిధిలోకి మార్చింది. ఇప్పటివరకు ఏసీ రెస్టారెంట్లపై 18%, నాన్ ఏసీ రెస్టారెంట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని 5% తగ్గించింది. ఈ మార్పులతో వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. 
రెస్టారెంట్లకు భారీ లాభం ప్రస్తుతం నాన్-ఏసీ రెస్టారెంట్లలో భోజనంపై 12%, ఏసీ రెస్టారెంట్లలో 18% జీఎస్టీ అమలవుతోంది. వీటన్నింటికీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రెస్టారెంట్లు వినియోగదారులకు ఇవ్వట్లేదు. దీనిపై గువాహటి సమావేశంలో చర్చించిన మండలి ఏసీ, నాన్-ఏసీ రెస్టారెంట్లను 5% పరిధిలోకి తీసుకొచ్చి ఐటీసీని ఎత్తేసింది.


సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 3.8% దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం నవంబర్ 10న విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. 
విభాగాల వారీగా...
  • ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది.
  • కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది.
  • విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది.


పదేళ్లు పెరిగిన భారతీయుల ఆయుష్షు 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత 10 ఏళ్లు పెరిగింది. ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన తాజా అధ్యయనంలో ఈ జీవనరేఖలు బయటపడ్డాయి. పురుషుల సగటు జీవిత కాలం 66.9 సంవత్సరాలకు పెరగ్గా, మహిళల జీవన సంభావ్యత 70.3 సంవత్సరాలకు పెరిగిందని జర్నల్ ప్రచురించింది. మహిళల ఆయుష్షు సంభావ్యత కేరళలో అధికంగా 78.7 ఏళ్లు ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 66.8 ఏళ్లు ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. సగటు జీవిత కాలం పెరగటానికి భారత దేశంలో పెరుగుతున్న అత్యాధునిక వైద్యసదుపాయాలతో పాటు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేనని లాన్సెట్ స్పష్టం చేసింది. కాని దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయని సర్వే తెలిపింది. అభివృద్ధి చెందిన కేరళ, గోవా వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు అన్ని రకాల వైద్య సేవల్లో 4 రెట్లు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది.


‘భారత్ నెట్’ రెండో దశ ప్రారంభం దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2019 మార్చి నాటికి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ ప్రాజెక్టు రెండో/తుది దశను నవంబర్ 13న ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.34,000 కోట్లు. ఇందులో భాగంగా అదనంగా 10 లక్షల కిలో మీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్, వైఫై సేవలను అందించే టెలికం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బ్యాండ్ విడ్త్ సౌకర్యం కల్పిస్తామని, ఆయా సంస్థలు సెకన్‌కు రెండు మెగా బిట్ల వేగంతో డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ పేర్కొన్నారు.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పేరు మార్పువ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) పథకంను రఫ్తార్ (వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుత్తేజానికి లాభసాటి విధానాలు - Remunerative Approaches for Agriculture and Allied sector Rejuvenation -RAFTAAR) గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో నవంబర్ 1న జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకానికి కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో (ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో 90:10) నిధులను సమకూరుస్తాయి. వార్షిక వ్యయంలో 50 శాతం నిధులను వ్యవసాయ మౌలిక వసతులు, ఆస్తుల కల్పన, 30 శాతం వాల్యూ అడిషన్ అనుసంధానిత ఉత్పత్తి ప్రాజెక్టులు, 20 శాతం స్థానిక అవసరాలకు అనుగుణంగా వెచ్చిస్తారు.


వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో 68,000 కోట్ల ఎంవోయూలున్యూఢిల్లీలో నవంబర్ 3న ప్రారంభమైన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2017’ సదస్సు తొలిరోజు రూ.68,000 కోట్ల విలువైన 13 ఒప్పందాలు కుదిరాయి. దేశీయ ఆహార, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు తమ ప్రణాళికలు వెల్లడించాయి.
మొదటిరోజు సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ వ్యాపార సులభతర నిర్వహణ సూచీలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్ 2017లో 100వ స్థానానికి చేరుకోవడం గొప్ప పురోగతిగా అభివర్ణించారు. గత మూడేళ్లలో చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణమని తెలిపారు.
ఒప్పందాల ముఖ్యాంశాలు
  • ఐటీసీ రూ.10,000 కోట్ల రూపాయలతో 20 సమగ్ర ఆహార ప్రాసెసింగ్, లాజిస్టిక్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది.
  • పతంజలి రూ.10,000 కోట్ల రూపాయిలను పెట్టుబడులుగా పెట్టనుంది.
  • పెప్సికో ఐదేళ్లలో 2 బిలియన్ డాలర్లు (రూ.12,800 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుంది.
  • అమెరికాకు చెందిన చాక్లెట్ తయారీ సంస్థ హెర్షీ ఐదేళ్లలో 50 మిలియన్ డాలర్లు (రూ.320 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది.


ఎన్‌పీఎస్ గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలున్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ పెంచింది. ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 65 కు పెంచుతూ నవంబర్ 1న ప్రకటన విడుదల చేసింది.


లింగ వ్యత్యాస సూచీలో భారత్‌కు 108 వ ర్యాంక్ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ (Global Gender Gap Index) 2017లో భారత్ 108వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే ఈ సారి 21 స్థానాలు దిగజారింది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 144 దేశాల్లో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయాల్లో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. రాజకీయ సాధికారత, ఆయుః ప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ర్యాకింగ్‌లో వెనకబడటానికి ప్రధాన కారణం అని డబ్ల్యూఈఎఫ్ వివరించింది.
జాబితాలో ఐస్‌లాండ్ తొలి స్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో నార్వే(2), ఫిన్‌లాండ్(3), రువాండా(4), స్వీడన్(5) ఉన్నాయి. 
నివేదిక ముఖ్యాంశాలు:
  • మొత్తం జాబితాలో భారత ర్యాంక్ 108
  • పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపుల్లో 136వ స్థానం
  • ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో 139వ స్థానం
  • ఆరోగ్యం, అస్తిత్వం విషయంలో 141వ స్థానం
  • భారత్ లింగ వ్యత్యాసాన్ని 67% పూరించింది. ఇది బంగ్లాదేశ్, చైనాలతో పోల్చితే తక్కువే
  • ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం లింగ వ్యత్యాసాన్ని పూరించారు. 2016లో ఇది 68.3 శాతంగా ఉంది.


విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యంవిదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో చేరే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ నవంబర్ 3న తెలిపారు. దీని కోసం కేంద్రం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో చేరాలంటే ఆయా దేశాల్లో వారు పొందుతున్న సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ)ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.


35 వేల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దునోట్ల రద్దు తర్వాత సుమారు 35 వేల కంపెనీలు బ్యాంకుల్లో రూ.17 వేల కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్ చేశాయని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 5న వెల్లడించింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. అలాగే 3.09 లక్షల మంది డెరైక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు 2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది.


ఓడరేవుల అభివృద్ధికి ‘సాగరమాల’ ప్రతిష్ఠాత్మక సాగరమాల కార్యక్రమంలో భాగంగా తీరప్రాంత ఓడ రేవుల పథకం కింద రూ.2,302 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ నవంబర్ 3న వెల్లడించింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌లో 12; ఏపీ, గోవాల్లో 10 చొప్పున; కర్ణాటకలో 6; కేరళ, తమిళనాడుల్లో మూడు చొప్పున; గుజరాత్‌లో 2; పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రాజెక్టు ఉన్నాయి. ఇందులో రూ.1,075 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులను ఇప్పటికే మంజూరు చేశారు. నౌకాయాన శాఖ ఈ పథకం పరిధిని విస్తరించడంతోపాటు అమలు గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది.





అక్టోబర్ 2017 ఎకానమీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 2018ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ - 2018లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది ఇదే ర్యాంకింగ్స్‌లో 130వ స్థానంలో భారత్ ఈసారి 30 స్థానాలు మెరుగుపరుచుకుంది. ‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. పన్నులు, లెసైన్సింగ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్ మెరుగుదలకు దోహదపడింది. 
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...
  • 2003 నుంచి భారత్ దాదాపు 37 సంస్కరణాత్మక చర్యలను తీసుకువచ్చింది. అందులో సగానికి సగం సంస్కరణలు మంచి ఫలితాలను అందించాయి. ప్రత్యేకించి గడచిన నాలుగేళ్లలో ఈ సంస్కరణల అమలు తీరు బాగుంది. ర్యాంకింగ్ మెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడింది.
  • ఈ ఏడాది తమ ర్యాంకులను భారీగా పెంచుకున్న 10 దేశాల్లో భారత్ ఒకటి.
  • భారత్ 100 ర్యాంక్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇలాంటి భారీ రికార్డు నమోదుచేసిన అతిపెద్ద దేశం భారత్ కావడమూ మరో విశేషం. భారత్ తన స్కోర్‌ను 4.71 పాయింట్ల మేర పెంచుకుని 60.76 పాయింట్లకు చేరింది.
  • గత రెండేళ్లుగా భారత్ ర్యాంక్ 130గా ఉంది. 2014లో దేశం ర్యాంక్ 142.

న్యూజిలాండ్ టాప్..సులువైన వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి నాలుగు స్థానాల్లో సింగపూర్ (2), డెన్మార్క్ (3), దక్షిణ కొరియా (4), హాంకాంగ్ (5) నిలిచాయి. అమెరికా 6వ స్థానం, బ్రిటన్ 7వ స్థానంలో నిలిచాయి. ఇక బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో 35వ ర్యాంక్ పొందింది.


దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్ ‘గూగుల్’టెక్నాలజీ దిగ్గజ కంపెనీ గూగుల్.. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మారుతీ సుజుకీ, యాపిల్ ఉన్నాయి. గ్లోబల్ కమ్యూనికేషన్‌‌స సంస్థ ‘కొహ్న్ - వోల్ఫ్’ ఈ విషయాలను వెల్లడించింది. సోనీ, యూట్యూబ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి బ్రాండ్‌‌స టాప్-10లో స్థానం పొందాయి. దాదాపు 67 శాతం మంది వినియోగదారులు వారి కొనుగోళ్లలో బ్రాండ్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే.. అమెజాన్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఉంది. దీని తర్వాతి స్థానంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పేపాల్ వంటి సంస్థలు ఉన్నాయి.

ఆర్‌కామ్-సిస్టెమా డీల్‌కు డాట్ అంగీకారంరిలయన్‌‌స కమ్యూనికేషన్‌‌సతో (ఆర్‌కామ్) సిస్టెమా శ్యామ్(ఎస్‌ఎస్‌టీఎల్) విలీనానికి టెలికం విభాగం (డాట్) తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సిస్టెమా శ్యామ్ వైర్‌లెస్ వ్యాపార విలీనానికి డాట్ అంగీకారం లభించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్‌ఎస్‌టీఎల్‌కు సంబంధించిన వైర్‌లెస్ బిజినెస్ అసెట్స్ అన్నీ ఆర్‌కామ్ పరిధిలోకి వస్తాయి. విలీనానం తరం ఆర్‌కామ్‌లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది.


జాతీయ రహదారుల నిర్మాణానికి 7 లక్షల కోట్లు ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్టు, ఇతర జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ. 7 లక్షల కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ భారీ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది.
భారత్ మాల
భారత్‌మాల ప్రాజెక్టులో దేశ సరిహద్దులతోపాటుగా కోస్తా, ఇతర ప్రాంతాలను కలుపుతూ (దాదాపు 50 వేల కిలోమీటర్లు) జాతీయ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కలుపుకుని ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించాలని మోదీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. భారత్‌మాల ప్రాజెక్టుల తొలి దశలో 20 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు 10 లక్షల కోట్లు ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేసింది. 2021-22 నాటికి ఈ ప్రతిపాదిత భారత్‌మాల ప్రాజెక్టు పనులను ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, మోర్త్, రాష్ట్రాల పీడబ్ల్యూడీ శాఖల సహకారంతో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి కేబినెట్ ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కార్గోలు వేగవంతంగా చేరేలా ఎకనమిక్ కారిడార్‌ల అభివృద్ధి కూడా ఉంది. ఈ ఎకనమిక్ కారిడార్లలో ముంబై-కొచ్చిన్-కన్యాకుమారి, బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పణజీ, సంబల్‌పూర్-రాంచీ వంటి 44 ప్రాజెక్టులున్నాయి.


పీఎస్‌బీ బ్యాంకులకు 2 ఏళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు మొండిబకాయిలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా రూ. 2.11 లక్షల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు వెల్లడించింది. ఇందులో రూ. 1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో రానుండగా, బడ్జెట్ కేటాయింపుల రూపంలో రూ. 18,139 కోట్లు, ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా మరో రూ. 58,000 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ మేరకు మూలధనం సమకూర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అక్టోబర్ 24న వెల్లడించారు. ఉపాధి కల్పించే చిన్న, మధ్య స్థాయి సంస్థల రంగానికి ఊతమిచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థలో పీఎస్‌బీలు కీలకపాత్ర పోషించేందుకు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు.
బ్యాంకింగ్ రంగంలో 2015 మార్చి నాటికి రూ. 2.75 లక్షల కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు 2017 జూన్ నాటికి రూ.7.33 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఇందులో 12 సంస్థలు కట్టాల్సినదే రూ.1.75 లక్షల కోట్ల మేర ఉంది. ఈ కేసులు ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఉన్నాయి.


2017లో భారత్ వృద్ధి రేటు 7 శాతం : ప్రపంచబ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2017-18)ంలో భారత్ వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన దక్షిణాసియా ఆర్థిక స్థితిగతుల నివేదికలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణమని వెల్లడించింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక.. తయారీ, సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక అంతర్గతంగా అడ్డంకుల కారణంగా ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయని, ఇది దేశ వృద్ధి అవకాశాలపై మరింతగా ఒత్తిడి పెంచగలదని హెచ్చరించింది. అయితే, ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల మధ్య సమతౌల్యత ఉండేలా తగు విధానాలు పాటిస్తే 2018లో వృద్ధి కొంత మెరుగుపడి 7.3 శాతం స్థాయికి చేరగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 6.7 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది.
2017-18లో వృద్ధికి కోత ఇలా..
సంస్థ
తాజా అంచనా
గత అంచనా
ఏడీబీ
7%
7.4%
ఓఈసీడీ
6.7%
7.3%
ఐఎంఎఫ్
6.7%
7.2%
ప్రపంచబ్యాంకు
7%
7.2%
ఆర్‌బీఐ
6.7%
7.3%


ఎయిర్‌టెల్ చేతికి టాటా టెలీ సర్వీసెస్ రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్ 12న ప్రకటించింది. తద్వారా.. నవంబర్ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్‌ఎల్), టాటా టెలీ మహారాష్ట్ర (టీటీఎంఎల్) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్‌టెల్‌కి బదిలీ అవుతారు. అయితే ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్‌టెల్ ఎలాంటి నగదూ చెల్లించటం లేదు. ఈ మేరకు ‘‘ఇది పూర్తిగా రుణ రహిత, నగదురహిత డీల్‌గా ఉంటుంది’’ అని ఇరు సంస్థలు వేర్వేరుగా ఇచ్చిన ప్రకటనల్లో వెల్లడించాయి.
అయితే, టాటా సంస్థ స్పెక్ట్రమ్‌కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో దాదాపు 20% (సుమారు రూ.1,500-2,000 కోట్లు) బాధ్యత మాత్రమే ఎయిర్‌టెల్ తీసుకుంటుంది. సుమారు రూ. 31,000 కోట్ల పైచిలుకు పేరుకుపోయిన టాటా టెలీ రుణాలను టాటా సన్‌‌స తీరుస్తుంది. తాజా ఒప్పందంతో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకు చేరనుంది.


రెపో రేటు యథాతథంఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో అక్టోబర్ 4న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటు యథాతథంగా ఉండటంతో పాటు రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉండనుంది. అలాగే వృద్ధి రేటును 7.3% నుంచి 6.7%కి ఆర్‌బీఐ పరిమితం చేసింది. ద్రవ్యోల్బణాన్ని గతంలో 4 శాతం నుంచి 4.5 శాతంగా అంచనా వేసిన ఆర్‌బీఐ దీనిని 4.2-4.6 శాతం శ్రేణికి పెంచింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్‌ఎల్‌ఆర్)ను 20% నుంచి 19.5%కి తగ్గించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన మొత్తమే ఎస్‌ఎల్‌ఆర్.
పాలసీ ముఖ్యాంశాలురెపో రేటు 6 శాతంగా యథాతథం
రివర్స్ రెపో 5.75 శాతంగా కొనసాగింపు
వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 6.7 శాతానికి కోత
ద్రవ్యోల్బణం ద్వితీయార్ధంలో 4.2-4.6% శ్రేణిలో ఉంటుందని అంచనా
తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5-6 న ఉంటుందని సూచన


27 వస్తువులపై జీఎస్టీ తగ్గింపువస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువుల పన్నురేట్లు తగ్గాయి. ఈ మేరకు అక్టోబర్ 6న జరిగిన జీఎస్టీ మండలి 22వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోటిన్నర లోపు వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలు ప్రతినెలా కాకుండా మూడు నెలలకోసారి పన్ను చెల్లింపుతో పాటు రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఇప్పటి వరకు కాంపోజిషన్ పథకంలో చేరేందుకు రూ.75 లక్షల టర్నోవర్ కలిగిన సంస్థలను అనుమతిస్తుండగా, ఆ పరిమితిని కోటి రూపాయలకు పెంచారు.
సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు
వస్తువు
పాత పన్నురేటు
సవరించిన రేటు
బ్రాండెడ్ కాని నమ్‌కీన్
12 శాతం
5 శాతం
ఆయుర్వేద ఔషధాలు
12 శాతం
5 శాతం
ముక్కలుగా కోసి ఎండబెట్టిన మామిడికాయలు
12 శాతం
5 శాతం
ఖాఖ్రా ఆహార పదార్థం (గుజరాత్, రాజస్తాన్‌లలో ప్రసిద్ధి)
12 శాతం
5 శాతం
ICDSకింద పాఠశాలలకు ఇచ్చే ఆహార పొట్లాలు
12 శాతం
5 శాతం
జరీ, ఇమిటేషన్ జ్యువెలరీ ఆహార పదార్థాల తయారీ, ప్రింటింగ్
12 శాతం
5 శాతం
ప్రభుత్వ కాంట్రాక్టులు(ఎక్కువ మంది కార్మికులు అవసరం)
12 శాతం
5 శాతం
మనుషులు తయారుచేసే నూలు
18 శాతం
12 శాతం
స్టేషనరీ వస్తువులు
18 శాతం
12 శాతం
నేలపై పరిచే బండలు(గ్రానైట్, మార్బుల్ మినహా)
18 శాతం
12 శాతం
నీటి పంపులు, డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు
28 శాతం
18 శాతం
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వేస్ట్)
28 శాతం
5 శాతం


కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులుదేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వరల్డ్ పోస్ట్ డేను పురస్కరించి అక్టోబర్ 9న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదట 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నామని చెప్పారు. అలాగే.. తపాలా శాఖ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.


బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్కెనడాకు చెందిన బంబార్డియర్.. దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాలను బంబార్డియర్ సరఫరా చేయనుంది. తొలుత 25 విమానాలను స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తుండగా, మరో 25 విమానాలను కొనుగోలు చేసే హక్కులను కలిగి ఉంటుంది. వీటి సరఫరా అనంతరం 90 సీట్ల టర్బో ప్రాప్ విమానాలను నడిపే ప్రపంచంలో తొలి విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ నిలుస్తుంది. అయితే, ఇందుకు నియంత్రణ సంస్థల ధ్రువీకరణ రావాల్సి ఉందని బంబార్డియర్ తెలిపింది.


భారత రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు భారత విదేశీ రుణ భారం ఈ ఏడాది జూన్ ముగిసే నాటికి 485.5 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం ముగింపు(మార్చి నెలాంతంలో 472 బిలియన్ డాలర్లు) పోల్చితే 3 శాతం మేర ఈ భారం పెరిగిందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ డెట్ విభాగంలోకి భారీగా రావడం.. త్రైమాసికంలో విదేశీ రుణం 3 శాతం పెరగడానికి కారణమని వివరించింది. జీడీపీ నిష్పత్తిలో విదేశీ రుణం 20.3 శాతంగా ఉందని తెలిపింది.

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ‘ఎక్సైజ్’ సుంకం తగ్గింపు లీటర్ డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు అక్టోబర్ 3న కేంద్ర ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.2 చొప్పున తగ్గాయి. ఈ ధరలు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.26 వేల కోట్లు లోటు ఉంటుంది.


భారత వృద్ధి రేటును తగ్గించిన ఏడీబీ2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) తగ్గించింది. జూలైతో పోల్చితే 0.4 శాతం తగ్గించి ఏడు శాతానికి పరిమితం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ వృద్ధి అంచనాలను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఆసియా అభివృద్ధి అంచనాలపై సెప్టెంబర్ 25న నివేదికను విడుదల చేసింది.








Wednesday, 11 October 2017

సెప్టెంబర్ 2017 ఎకానమీ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పెంపుదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాల(ఎంఐజీ)కు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద అందిస్తున్న రూ.2.60 లక్షల వడ్డీ సబ్సిడీ గడువును 2019 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రధాని మోదీ ప్రారంభించిన రుణ అనుసంధానిత సబ్సిడీ పథకానికి(సీఎల్‌ఎస్‌ఎస్) తుదిగడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుండటంతో ప్రభుత్వం మరో 15 నెలలు పొడిగించింది. 
2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ సొంతిళ్లు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. రూ.6-12 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలు 20 ఏళ్ల కాలపరిమితితో రూ.9 లక్షల వరకు తీసుకునే రుణాలపై కేంద్రం ప్రస్తుతం సీఎల్‌ఎస్‌ఎస్ కింద 4% సబ్సిడీని అందిస్తోంది. వార్షికాదాయం రూ.12-18 లక్షలు ఉండే మధ్య తరగతి కుటుంబాలకు 3% వడ్డీ సబ్సిడీని అందిస్తోంది. 
 

"సౌభాగ్య" పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీగ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకాన్ని (ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన) ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రూ. 16,320 కోట్లతో డిసెంబర్ 2018 నాటికి దేశంలో విద్యుత్ సదుపాయం లేని కుటుంబాలకు కనెక్షన్లను అందచేస్తారు. 
‘సౌభాగ్య’ పథకం వివరాలు 
  • ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 16,320 కోట్లు..
  • గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణకు రూ. 14,025 కోట్లు
  • పట్టణాల్లో విద్యుదీకరణకు రూ. 2,295 కోట్లు
  • ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులు సమకూరుస్తాయి. మిగతా మొత్తం రుణాల రూపంలో సేకరిస్తారు.
  • సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్‌ఈసీసీ)- 2011 సమాచారం ఆధారంగా ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎస్‌ఈసీసీ కిందకు రాని వారికి కూడా విద్యుత్ కనెక్షన్లు లేకపోతే ఈ సదుపాయం కల్పిస్తారు. అయితే వారి నుంచి 500 రూపాయల్ని 10 వాయిదాల్లో విద్యుత్ బిల్లుల ద్వారా డిస్కంలు వసూలు చేస్తాయి.
  • గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఈసీ) ఈ పథకానికి దేశమంతా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.


బాలకార్మిక రహిత సమాజానికి ‘పెన్సిల్’బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ‘పెన్సిల్’ అనే పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 26న ఆవిష్కరించారు. ప్లాట్‌ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ దీని పూర్తి పేరు. బాలకార్మిక వ్యవస్థ రహిత సమాజ స్థాపనకు కేంద్రం, రాష్ట్రం, జిల్లా యంత్రాంగం, పౌరుల భాగస్వాములయ్యేందుకు ఈ ఫోరం వేదిక అవుతుందని రాజ్‌నాథ్ తెలిపారు. చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థ, ఫిర్యాదు విభాగం, జిల్లా యంత్రాంగ సమన్వయం, తదితర వ్యవస్థలు ఇందులో ఉంటాయి.


బ్రాండ్జ్ ఇండియా నివేదికలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్ దేశంలోని గొప్ప బ్రాండ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నంబర్ 1 గా తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ మేరకు దేశంలో అత్యంత విలువైన మొదటి 50 బ్రాండ్ల వివరాలను ‘బ్రాండ్‌‌జ ఇండియా టాప్ 50’ పేరుతో ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ, పరిశోధనా సంస్థ కంటార్ మిల్‌వర్డ్ బ్రౌన్ సంస్థలు సెప్టెంబర్ 14న ప్రకటించాయి. 
ఈ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని నాలుగేళ్ల నుంచి కాపాడుకుంటు వస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. 2014 నుంచి తన బ్రాండ్ విలువను 9.4 బిలియన్ డాలర్ల నుంచి 18 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. కాగా కొత్తగా జాబితాలో 7 సంస్థలకు చోటు దక్కింది. టెలికంలోకి కొత్తగా ప్రవేశం చేసిన రిలయన్‌‌స జియో 11వ స్థానం సంపాదించింది. 
 

జీవనకాల గరిష్ఠానికి విదేశీ మారక నిల్వలు విదేశీ మారక నిల్వలు జీవిత కాల గరిష్ఠానికి చేరాయి. గత వారం నిల్వలు 398.122 బిలయన్ డాలర్లతో పోలిస్తే, ఈ వారం 2.604 బిలియన్ డాలర్లు పెరిగి 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న తాజా గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు 2.568 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 376.209 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల్లో మార్పులు లేకుండా 20.691 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 
విదేశీ మారక నిల్వలు 400 బిలియన్ డాలర్లకు చేరడం వల్ల, ఏడాది పాటు మన దిగుమతులకు సరిపోతాయి. 


10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
2015-16 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. 
 

బీపీసీఎల్‌కు మహారత్న హోదా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 12న ‘మహారత్న’ హోదా ప్రకటించింది. నవరత్న కంపెనీ అయి ఉండి గత మూడేళ్లలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ.25,000 కోట్లకుపైగా సగటు వార్షిక టర్నోవర్ నమోదు చేసిన వాటికి ఈ హోదా ఇస్తారు. గత మూడేళ్లలో రూ.15,000 కోట్ల సగటు నికర విలువ, రూ.5000 కోట్ల సగటు వార్షిక నికర లాభం ఆర్జించి ఉండాలి. మహారత్న హోదా వచ్చిన ప్రభుత్వ కంపెనీలకు రూ.1000-5000 కోట్ల వరకు పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవ డానికి స్వేచ్ఛ ఉంటుంది. నవరత్న హోదా ఉన్నవాటికి ఈ పరిమితి రూ.1000 కోట్లు. 

సుస్థిర ఆరోగ్య లక్ష్యాల సాధనలో128వ స్థానం ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని ఆరోగ్య సంబంధ గమ్యాలను చేరుకోవడంలో భారత్ వెనకబడుతోందని ‘ది లాన్సెట్’ వైద్య పత్రిక సెప్టెంబర్ 12న తెలిపింది. ఈ లక్ష్యాలను 2030లోగా చేరుకోవాలి. ఈ దిశగా సాధించిన ప్రగతిలో వాయు కాలుష్యం, పారిశుద్ధ్యం, హెపటైటిస్-బి, పిల్లల్లో పోషకాహార లోపం వంటి అంశాల్లో బాగా వెనకబడిందని వివరించింది. 1990-2014లోని ధోరణులను విశ్లేషిస్తూ వాషింగ్టన్ వర్సిటీ అనుబంధ సంస్థ జరిపిన అధ్యయన ఫలితాలను ‘ది లాన్సెట్’ పేర్కొంది. 180 దేశాలకు సంబంధించి 2030 నాటికి ఉండబోయే పరిస్థితిపై అంచనాలు రూపొందించింది.

ఉద్యోగ కల్పనకు నీతిఆయోగ్ టాస్క్‌ఫోర్స్ దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ దీనికి నేతృత్వం వహిస్తారు. పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెంచడం, సంఘటిత రంగంలో సవాళ్లను అధిగమించడం ద్వారా ఉద్యోగ అవకాశాల పెంపుదలపై నిపుణులతో కూడిన ఈ టాస్‌్టఫోర్స్ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 


2020 నాటికి తట్టు రహిత దేశంగా భారత్ భారత్‌తో పాటు ఆగ్నేయాసియాలోని మరో నాలుగు దేశాలను(బంగ్లాదేశ్, మయన్మార్, తైమూర్, ఇండోనేషియా) 2020 నాటికి తట్టు(మీసెల్స్) రహిత ప్రాంతాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్యో సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అలాగే.. 2018 నాటికి ఈ దేశాల్లోని 400 మిలియన్ల చిన్నారులకు తట్టు నిరోధక టికాలను సరఫరా చేయనుంది. 
డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం వైరస్ కారణంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా యేటా 1,34,200 మంది చిన్నారులు మరణిస్తున్నారు. 


ప్రత్యేక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ విభాగంప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన మొబైల్ టవర్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సెప్టెంబర్ 12న ఆమోదముద్ర వేసింది. దేశీయంగా ప్రస్తుతం 4,42,000 మొబైల్ టవర్స్ ఉండగా, వీటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందినవి 66,000 పైచిలుకు ఉన్నాయి. టవర్స్ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని టెల్కోలకు అద్దెకివ్వడం ద్వారా కొత్త కంపెనీ మరింత ఆదాయం ఆర్జించగలిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.


పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ' స్కూల్ చలో అభియాన్'దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కూల్ చలో అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది. సెప్టెంబర్ 8న 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో పాల్గొన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా పాఠశాలలకు దూరంగా ఉన్న 70లక్షల నుంచి 80 లక్షల మంది చిన్నారులను బడుల్లో చేర్పిస్తారు.

రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయి : ఆర్‌బీఐ నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ.1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99% బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికను ఆగస్టు 30న విడుదల చేసిన ఆర్‌బీఐ.. నోట్ల రద్దు తదనంతర ఫలితాలను ఇందులో వివరించింది. 
నివేదికలోని ముఖ్యాంశాలు..
  • రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు.
  • నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో 98.6% నోట్లు బ్యాంకుల్లో జమకాగా కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోనికి రాలేదు.
  • కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు భారీగా పెరిగింది. 2015-16లో రూ. 3,421 కోట్లు ఖర్చు కాగా, 2016-17లో అది రెండింతలు దాటి రూ. 7,965 కోట్లకు చేరింది.
  • చలామణిలో ఉన్న నగదు విలువ 2017 మార్చి నాటికి 13.1 లక్షల కోట్లు. గత సంవత్సరం కన్నా ఇది 20.2% తక్కువ.
  • ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3%గా ఉంటుంది.


2017-18 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతం2017-18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి- మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తరవాత అత్యంత తక్కువ ఇదే. ఈ మేరకు ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం(CSO) ఆగస్టు 31న విడుదల చేసింది. జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్) 5.6 శాతంగా నమోదైందని వెల్లడించింది. 
గతేడాది ఇదే కాలంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదైంది. 


ఆధార్-పాన్ అనుసంధానం గడువు పెంపు ఆధార్-పాన్ అనుసంధానం గడువుని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 31న ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువునిచ్చింది.
పన్ను చెల్లింపుదారులు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు ఆగస్ట్ 31తో ముగిసింది. 


వ్యవసాయ పథకాల్లో మహిళా రైతులకు 30 శాతం నిధులువ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే మహిళా రైతుల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మహిళా స్వయం సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాలని భావిస్తోంది. అలాగే.. 2016లో నిర్ణయించిన విధంగా ఏటా అక్టోబర్ 15వ తేదీని మహిళా రైతు దినోత్సవంగా పాటించాలని స్పష్టంచేసింది. 
దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారేనని జాతీయ నమూనా సర్వే తేల్చింది. ఆ 80 శాతం మందిలో 33 శాతం మహిళలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. 48 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి కలిగిన మహిళా రైతులున్నారు. 



Wednesday, 23 August 2017

ఆగస్టు 2017 ఎకానమీ

చైనా టాంపర్డ్ గ్లాస్‌లపై దిగుమతి నిరోధక సుంకంచైనా నుంచి దిగుమతి అయ్యే టాంపర్డ్ గ్లాస్‌ల (మొబైల్ స్క్రీన్ సేవర్) పై భారత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దిగుమతి నిరోధక సుంకం (యాంటీ డంపింగ్ డ్యూటీ) విధించింది. టన్ను టాంపర్డ్ గ్లాస్‌లపై 52.85 డాలర్ల నుంచి 136.21 డాలర్ల వరకు పన్ను విధింపు వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ ఆగస్టు 21న నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 


త్వరలో చెలామణిలోకి రూ.200 నోట్లు మొదటిసారిగా రూ.200 నోట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. చిన్నపాటి లావాదేవీలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు వీలైనంత త్వరగా వీటిని వాడుకలోకి తీసుకురావాలని రిజర్వుబ్యాంకును ఆదేశించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. రూ.2000 నోట్లు కూడా ఆశించిన స్థాయిలో తిరిగి బ్యాంకులకు చేరకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు ఆర్బీఐ గుర్తించింది.


ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనుండగా.. బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. 
2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది. 
 

నీతి ఆయోగ్ 3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతానికి పైగా నమోదవడానికి పుష్కలంగా అవకాశాలున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాలు సమకూర్చేలా ఉండాలని సూచించింది. ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ‘మూడేళ్ల సమగ్ర ప్రణాళిక- 2017-18 నుంచి 2019-20’ని ఆగస్టు 24న ఆవిష్కరించింది. నల్లధనం, అవినీతి నిరోధం, పన్ను పరిధి పెంపు, సివిల్ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ వంటి కీలక అంశాలపై సూచనలు ఇందులో ఉన్నాయి. 
ప్రణాళికలోని ముఖ్యాంశాలు
- వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన భారీగా జరిగే వీలుంది. 
-కేంద్ర ప్రభుత్వ వ్యయాల విషయంలో భవిష్యత్ ప్రాధాన్యతపై దృష్టి ఉండాలి. అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు కేటాయింపులు జరగాలి. ఇది వృద్ధి ప్రోత్సాహానికి దారితీస్తుంది. 
-2019-20 నాటికి అధిక నిధులను విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు అభివృద్ధికి కేటాయించాలి. 
- సామాజిక రంగం విషయంలో విద్య, వైద్య రంగాలు మెరుగుపడాలి. మానవ వనరుల నైపుణ్యతలో పురోగతి ఉండాలి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. 


లక్ష్యాన్ని దాటిన తొలి జీఎస్‌టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించాయి. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 29న వెల్లడించారు. అలాగే.. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ విధానం కింద రిజిస్టర్ కాగా వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి మాత్రమే పన్ను వసూళ్లు జరిగాయి. 
జూలైలో జీఎస్‌టీ ద్వారా మొత్తం రూ.91,000 కోట్లు మాత్రమే లభిస్తాయని వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. 


2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు2016-17లో దేశంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 16న విడుదల చేసిన నాలుగో అంచనాల నివేదిక మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. అందులో 11.01 కోట్ల టన్నుల వరి పండింది. ఇక పప్పుధాన్యాలు 2.29 కోట్ల టన్నులు, పత్తి 2.29 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది. 2015-16లో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.01 కోట్ల టన్నులు కాగా, ఈసారి 55 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయినట్లు వెల్లడించింది. వరి ఈసారి 61 లక్షల టన్నులు అధిక ఉత్పత్తి జరిగింది. ఇక పత్తి 2015-16లో 1.63 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2016-17లో అదనంగా 66 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయింది.


మెట్రో రైలు పాలసీ - 2017దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నూతన మెట్రో రైలు విధానం 2017 ని ఆమోదించింది. ప్రైవేట్ రంగంతో పాటు ఇతర మార్గాలైన వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ (VCF), బాండ్ల జారీతో నిధులు సేకరించేందుకు ఇందులో చర్యలు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 16న ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం తాము చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే రాష్ట్రాలు ప్రైవేట్ సంస్థలతో జట్టుకట్టడం తప్పనిసరి చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి, వ్యయం తగ్గింపునకు ఈ విధానంలో ప్రాధాన్యమిచ్చారు. మెట్రో ప్రాజెక్టుల అమలుకు ఏకీకృత నిబంధనలను రూపొందించడంతో పాటు, నిధుల సేకరణకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 
మెట్రో రైలు పాలసీ-2017 ముఖ్యాంశాలు
  • నిధుల డిమాండ్‌ను తట్టుకోవాలంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి.
  • మొత్తం ప్రాజెక్టులో లేదా అనుబంధ విభాగాలైన చార్జీల వసూలు, నిర్వహణలో ప్రైవేట్ సంస్థ పాలుపంచుకోవాలి.
  • ప్రైవేట్ రంగంలోని వనరులు, నిపుణత, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవడానికే ఈ నిర్ణయం.
  • స్టేషన్‌లో వాణిజ్య ఆస్తుల అభివృద్ధి, స్థలాల లీజులు, వాణిజ్య ప్రకటనల ద్వారా లభించే ఆదాయానికి సంబంధించి తీసుకునే చర్యలను రాష్ట్రాలు తమ ప్రాజెక్టు రిపోర్టులో సవివరంగా తెలియజేయాలి.
  • సమయానుగుణంగా చార్జీలను సవరించేలా నిబంధనల మార్పునకు, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించారు.
కేంద్రం నుంచి నిధులు పొందే మార్గాలు: వయబిలిటీ గ్యాప్ ఫండ్, కేంద్ర గ్రాంట్లు (ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం), 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈక్విటీ షేరింగ్. 
విద్యా సెస్‌తో నిధి: సెకండరీ, ఉన్నత విద్య ద్వారా సమకూరే సెస్ నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘మాధ్యమిక్ అండ్ ఉచ్చతర్ శిక్షా కోశ్’(ముస్క్)గా పిలిచే ఈ నిధి మానవ వనరుల శాఖ నిర్వహణలో కొనసాగుతుంది. ముస్క్ నిధులను మాధ్యమిక, ఉన్నత విద్య పథకాలకు వెచ్చిస్తారు. 
 

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ‘జీఎస్టీ’ మద్దతు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికోసం పదేళ్లపాటు రూ.27,413 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ కన్నా ముందు ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చిన కారణంగా.. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో ఆగస్టు 16న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. జూలై 1, 2017 నుంచి మార్చి 31, 2027 వరకు ఇది వర్తిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక పాలసీ-2007ను సిక్కింతో పాటు ప్రత్యేక హోదా పొందుతున్న జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ కేంద్రం అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తొలి పదేళ్ల పాటు ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా 4,284 పరిశ్రమలకు ప్రత్యక్ష నగదు సరఫరా ద్వారా రీఫండ్ జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.


22 క్యారెట్లకు పైబడిన బంగారం ఎగుమతులపై నిషేధం22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. 


వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి 2017-18లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీతో స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆగస్టు 16న నిర్ణయం తీసుకుంది. 
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకం కింద రైతులు బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఈ రుణంపై బ్యాంకులు 7 శాతం వడ్డీ విధిస్తుండగా.. ఇందులో 2 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. వాయిదా చెల్లింపులు క్రమంగా తప్పకుండా చెల్లించే వారికి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 
 

త్వరలో కొత్త 50 రూపాయల నోట్లుఆర్‌బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. ఇవి నీలి రంగులో (ఫ్లోరోసెంట్ బ్లూ) ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. కొత్త నోట్లు మార్కెట్‌లోకి వచ్చినా పాత రూ.50 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. 


అమెరికా నుంచి తొలిసారిగా ముడి చమురు దిగుమతిప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8-14 మధ్య మొదలైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్‌లో భారత్‌కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది. ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి.

ఫోర్బ్స్ సృజనాత్మక కంపెనీల్లో మూడు దేశీ సంస్థలునూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచంలోనే 100 అత్యుత్తమ సృజనాత్మక కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్ (హెచ్‌యూఎల్), ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. హెచ్‌యూఎల్ క్రితం సారి 31వ స్థానంలో ఉండగా ఈసారి ఏడో స్థానానికి, ఏషియన్ పెయింట్స్ 18వ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకాయి. ఎయిర్‌టెల్ కొత్తగా 78వ ర్యాంకుతో జాబితాలో చోటు దక్కించుకుంది. టీసీఎస్, సన్ ఫార్మా, లార్సన్ అండ్ టూబ్రో గతేడాది జాబితాలో ఉన్నప్పటికీ ఈసారి స్థానం లభించలేదు. దీంతో లిస్టులో భారతీయ సంస్థల సంఖ్య అయిదు నుంచి మూడుకి తగ్గింది. 
2017 జాబితాలో తొలిస్థానంలో సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్, రెండో స్థానంలో టెస్లా మోటర్స్, మూడో స్థానంలో అమెజాన్‌డాట్‌కామ్ ఉన్నాయి. కనీసం 10 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల సంస్థలకు ఇందులో చోటు ఉంటుంది. 

2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల మేరకు గరిష్ట వృద్ధి రేటు నమోదు కష్టమేనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌ను ఆగస్టు 11న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5 శాతం మధ్య నమోదవుతుందని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 7.5 శాతం వృద్ధి రేటు అసాధ్యమేనని పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకునేందుకు మరిన్ని రేట్ల కోతలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యమైన 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి విలువ బలపడడం, రైతుల రుణాల మాఫీ, విద్యుత్, టెలికం రంగ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, కొత్త పన్ను వ్యవస్థ జీఎస్టీకి మారడం వంటి అంశాలను సవాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రైతుల రుణ మాఫీయే జీడీపీ వృద్ధిని 0.7 శాతం వరకు తగ్గించేస్తుందని అంచనా వేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే బాట అనుసరిస్తే మొత్తం భారం రూ.2.7 లక్షల కోట్లుగా ఉంటుందని, ఇది ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేశాయి. 
ఆర్థిక సర్వే ప్రధానాంశాలు
  • 2017-18లో జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతానికి దిగొస్తుంది. 2016-17లో 3.5%.
  • రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి వరకు 4 శాతంలోపే ఉండొచ్చు.
  • పాలసీ రేట్లను 25-75 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు.
  • డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా 5.4 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తోడయ్యారు.


నదుల్లో 15-20% మధ్య ప్రవాహాలు తప్పనిసరిదేశవ్యాప్తంగా నదుల్లో 15 నుంచి 20 శాతం మధ్య నీటి ప్రవాహాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జీవనోపాధికి, పర్యావరణ పరిరక్షణ చర్యల నిమిత్తం నదుల్లో కొంత లోతు మేర స్వచ్ఛమైన నీటిని లభ్యమయ్యేలా 15 నుంచి 20 శాతం నదుల ప్రవాహాలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలకు ఏ రాష్ట్రమైనా కట్టుబడి ఉండటం సాధ్యం కాకపోతే ఆ రాష్ట్రం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను కలవొచ్చని సూచించింది.
 

2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవారాలంటే.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.6.4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయడింది. ఈ మేరకు ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబ ఆదాయం రూ.96,703గా ఉంది. దీన్ని 2022-23 నాటికి రూ.2,19,724లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీరేటు - రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. అదే విధంగా బ్యాంకులు తమ వద్ద స్వల్పకాలికంగా ఉంచే అదనపు నిధులకు సంబంధించి చెల్లించే రేటు- రివర్స్ రెపోను కూడా పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.75 శాతానికి తగ్గింది. దాదాపు పది నెలల నుంచీ ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలతో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్‌బీఐ, ప్రస్తుతం ఈ భయాలు తగ్గడంతో రెపో రేటు పావుశాతం తగ్గించినట్లుగా వివరించింది. వృద్ధికి ఇది భరోసా కల్పిస్తున్న అంశంగా పేర్కొంది. 
తగ్గనున్న ఈఎంఐ భారం రెపో తగ్గింపు ద్వారా లభిస్తున్న ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వల్ల గృహ, ఆటో, కార్పొరేట్ల నెలవారీ రుణ పునః చెల్లింపుల (ఈఎంఐ) భారం కొంత తగ్గుతుంది. 
మరిన్ని ముఖ్యాంశాలు.. 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా 7.3 శాతంగా కొనసాగింపు.
  • బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం- 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎటువంటి మార్పు లేదు.
  • 6.25 శాతానికి దిగివచ్చిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్), బ్యాంక్ రేటు.
  • ప్ల్లస్ 2 లేదా మైనస్ 2 శ్రేణితో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం లక్ష్యాలను కొనసాగించడంపై దృష్టి.
  • 2017 జూలై 28కి 392.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు.
  • ఆర్‌బీఐ తదుపరి పరపతి విధాన సమీక్ష 2017 అక్టోబర్ 3, 4 తేదీల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక సమావేశం) జరుగుతుంది.


కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్-22’‘భారత్-22’ పేరుతో కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్-22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 4న ప్రకటించారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. 
భారత్-22 జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్-22లో చేర్చారు. 
మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే.. ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదే తరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది. 


11.4 లక్షల పాన్‌కార్డులు డీయాక్టివేట్ దేశవాప్తంగా 11.4 లక్షల పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం క్రియారహితం (డీయాక్టివేట్) చేసింది. అందులో కొన్నింటిని రద్దు కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నంబరుతో అనుససంధానం చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది. 
డీయాక్టివ్ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ విభాగం ఇ- ఫిల్లింగ్ వెబ్‌సైట్‌ని సందర్శించండి. అందులో ’Know Your Pan’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ పేజీ వస్తుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జాగ్రత్తగా పూర్తిచేసి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది. 


ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధిపెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించింది. 
వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుండా) అడ్వాన్స్‌ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నాటికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి.