Wednesday, 23 August 2017

ఆగస్టు 2017 ఎకానమీ

చైనా టాంపర్డ్ గ్లాస్‌లపై దిగుమతి నిరోధక సుంకంచైనా నుంచి దిగుమతి అయ్యే టాంపర్డ్ గ్లాస్‌ల (మొబైల్ స్క్రీన్ సేవర్) పై భారత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దిగుమతి నిరోధక సుంకం (యాంటీ డంపింగ్ డ్యూటీ) విధించింది. టన్ను టాంపర్డ్ గ్లాస్‌లపై 52.85 డాలర్ల నుంచి 136.21 డాలర్ల వరకు పన్ను విధింపు వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ ఆగస్టు 21న నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 


త్వరలో చెలామణిలోకి రూ.200 నోట్లు మొదటిసారిగా రూ.200 నోట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. చిన్నపాటి లావాదేవీలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు వీలైనంత త్వరగా వీటిని వాడుకలోకి తీసుకురావాలని రిజర్వుబ్యాంకును ఆదేశించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. రూ.2000 నోట్లు కూడా ఆశించిన స్థాయిలో తిరిగి బ్యాంకులకు చేరకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు ఆర్బీఐ గుర్తించింది.


ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనుండగా.. బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. 
2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది. 
 

నీతి ఆయోగ్ 3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతానికి పైగా నమోదవడానికి పుష్కలంగా అవకాశాలున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాలు సమకూర్చేలా ఉండాలని సూచించింది. ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ‘మూడేళ్ల సమగ్ర ప్రణాళిక- 2017-18 నుంచి 2019-20’ని ఆగస్టు 24న ఆవిష్కరించింది. నల్లధనం, అవినీతి నిరోధం, పన్ను పరిధి పెంపు, సివిల్ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ వంటి కీలక అంశాలపై సూచనలు ఇందులో ఉన్నాయి. 
ప్రణాళికలోని ముఖ్యాంశాలు
- వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన భారీగా జరిగే వీలుంది. 
-కేంద్ర ప్రభుత్వ వ్యయాల విషయంలో భవిష్యత్ ప్రాధాన్యతపై దృష్టి ఉండాలి. అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు కేటాయింపులు జరగాలి. ఇది వృద్ధి ప్రోత్సాహానికి దారితీస్తుంది. 
-2019-20 నాటికి అధిక నిధులను విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు అభివృద్ధికి కేటాయించాలి. 
- సామాజిక రంగం విషయంలో విద్య, వైద్య రంగాలు మెరుగుపడాలి. మానవ వనరుల నైపుణ్యతలో పురోగతి ఉండాలి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. 


లక్ష్యాన్ని దాటిన తొలి జీఎస్‌టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించాయి. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 29న వెల్లడించారు. అలాగే.. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ విధానం కింద రిజిస్టర్ కాగా వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి మాత్రమే పన్ను వసూళ్లు జరిగాయి. 
జూలైలో జీఎస్‌టీ ద్వారా మొత్తం రూ.91,000 కోట్లు మాత్రమే లభిస్తాయని వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. 


2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు2016-17లో దేశంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 16న విడుదల చేసిన నాలుగో అంచనాల నివేదిక మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. అందులో 11.01 కోట్ల టన్నుల వరి పండింది. ఇక పప్పుధాన్యాలు 2.29 కోట్ల టన్నులు, పత్తి 2.29 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది. 2015-16లో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.01 కోట్ల టన్నులు కాగా, ఈసారి 55 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయినట్లు వెల్లడించింది. వరి ఈసారి 61 లక్షల టన్నులు అధిక ఉత్పత్తి జరిగింది. ఇక పత్తి 2015-16లో 1.63 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2016-17లో అదనంగా 66 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయింది.


మెట్రో రైలు పాలసీ - 2017దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నూతన మెట్రో రైలు విధానం 2017 ని ఆమోదించింది. ప్రైవేట్ రంగంతో పాటు ఇతర మార్గాలైన వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ (VCF), బాండ్ల జారీతో నిధులు సేకరించేందుకు ఇందులో చర్యలు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 16న ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం తాము చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే రాష్ట్రాలు ప్రైవేట్ సంస్థలతో జట్టుకట్టడం తప్పనిసరి చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి, వ్యయం తగ్గింపునకు ఈ విధానంలో ప్రాధాన్యమిచ్చారు. మెట్రో ప్రాజెక్టుల అమలుకు ఏకీకృత నిబంధనలను రూపొందించడంతో పాటు, నిధుల సేకరణకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 
మెట్రో రైలు పాలసీ-2017 ముఖ్యాంశాలు
  • నిధుల డిమాండ్‌ను తట్టుకోవాలంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి.
  • మొత్తం ప్రాజెక్టులో లేదా అనుబంధ విభాగాలైన చార్జీల వసూలు, నిర్వహణలో ప్రైవేట్ సంస్థ పాలుపంచుకోవాలి.
  • ప్రైవేట్ రంగంలోని వనరులు, నిపుణత, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవడానికే ఈ నిర్ణయం.
  • స్టేషన్‌లో వాణిజ్య ఆస్తుల అభివృద్ధి, స్థలాల లీజులు, వాణిజ్య ప్రకటనల ద్వారా లభించే ఆదాయానికి సంబంధించి తీసుకునే చర్యలను రాష్ట్రాలు తమ ప్రాజెక్టు రిపోర్టులో సవివరంగా తెలియజేయాలి.
  • సమయానుగుణంగా చార్జీలను సవరించేలా నిబంధనల మార్పునకు, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించారు.
కేంద్రం నుంచి నిధులు పొందే మార్గాలు: వయబిలిటీ గ్యాప్ ఫండ్, కేంద్ర గ్రాంట్లు (ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం), 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈక్విటీ షేరింగ్. 
విద్యా సెస్‌తో నిధి: సెకండరీ, ఉన్నత విద్య ద్వారా సమకూరే సెస్ నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘మాధ్యమిక్ అండ్ ఉచ్చతర్ శిక్షా కోశ్’(ముస్క్)గా పిలిచే ఈ నిధి మానవ వనరుల శాఖ నిర్వహణలో కొనసాగుతుంది. ముస్క్ నిధులను మాధ్యమిక, ఉన్నత విద్య పథకాలకు వెచ్చిస్తారు. 
 

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ‘జీఎస్టీ’ మద్దతు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికోసం పదేళ్లపాటు రూ.27,413 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ కన్నా ముందు ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చిన కారణంగా.. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో ఆగస్టు 16న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. జూలై 1, 2017 నుంచి మార్చి 31, 2027 వరకు ఇది వర్తిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక పాలసీ-2007ను సిక్కింతో పాటు ప్రత్యేక హోదా పొందుతున్న జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ కేంద్రం అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తొలి పదేళ్ల పాటు ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా 4,284 పరిశ్రమలకు ప్రత్యక్ష నగదు సరఫరా ద్వారా రీఫండ్ జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.


22 క్యారెట్లకు పైబడిన బంగారం ఎగుమతులపై నిషేధం22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. 


వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి 2017-18లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీతో స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆగస్టు 16న నిర్ణయం తీసుకుంది. 
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకం కింద రైతులు బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఈ రుణంపై బ్యాంకులు 7 శాతం వడ్డీ విధిస్తుండగా.. ఇందులో 2 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. వాయిదా చెల్లింపులు క్రమంగా తప్పకుండా చెల్లించే వారికి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 
 

త్వరలో కొత్త 50 రూపాయల నోట్లుఆర్‌బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. ఇవి నీలి రంగులో (ఫ్లోరోసెంట్ బ్లూ) ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. కొత్త నోట్లు మార్కెట్‌లోకి వచ్చినా పాత రూ.50 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. 


అమెరికా నుంచి తొలిసారిగా ముడి చమురు దిగుమతిప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8-14 మధ్య మొదలైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్‌లో భారత్‌కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది. ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి.

ఫోర్బ్స్ సృజనాత్మక కంపెనీల్లో మూడు దేశీ సంస్థలునూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచంలోనే 100 అత్యుత్తమ సృజనాత్మక కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్ (హెచ్‌యూఎల్), ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. హెచ్‌యూఎల్ క్రితం సారి 31వ స్థానంలో ఉండగా ఈసారి ఏడో స్థానానికి, ఏషియన్ పెయింట్స్ 18వ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకాయి. ఎయిర్‌టెల్ కొత్తగా 78వ ర్యాంకుతో జాబితాలో చోటు దక్కించుకుంది. టీసీఎస్, సన్ ఫార్మా, లార్సన్ అండ్ టూబ్రో గతేడాది జాబితాలో ఉన్నప్పటికీ ఈసారి స్థానం లభించలేదు. దీంతో లిస్టులో భారతీయ సంస్థల సంఖ్య అయిదు నుంచి మూడుకి తగ్గింది. 
2017 జాబితాలో తొలిస్థానంలో సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్, రెండో స్థానంలో టెస్లా మోటర్స్, మూడో స్థానంలో అమెజాన్‌డాట్‌కామ్ ఉన్నాయి. కనీసం 10 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల సంస్థలకు ఇందులో చోటు ఉంటుంది. 

2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల మేరకు గరిష్ట వృద్ధి రేటు నమోదు కష్టమేనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌ను ఆగస్టు 11న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5 శాతం మధ్య నమోదవుతుందని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 7.5 శాతం వృద్ధి రేటు అసాధ్యమేనని పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకునేందుకు మరిన్ని రేట్ల కోతలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యమైన 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి విలువ బలపడడం, రైతుల రుణాల మాఫీ, విద్యుత్, టెలికం రంగ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, కొత్త పన్ను వ్యవస్థ జీఎస్టీకి మారడం వంటి అంశాలను సవాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రైతుల రుణ మాఫీయే జీడీపీ వృద్ధిని 0.7 శాతం వరకు తగ్గించేస్తుందని అంచనా వేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే బాట అనుసరిస్తే మొత్తం భారం రూ.2.7 లక్షల కోట్లుగా ఉంటుందని, ఇది ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేశాయి. 
ఆర్థిక సర్వే ప్రధానాంశాలు
  • 2017-18లో జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతానికి దిగొస్తుంది. 2016-17లో 3.5%.
  • రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి వరకు 4 శాతంలోపే ఉండొచ్చు.
  • పాలసీ రేట్లను 25-75 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు.
  • డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా 5.4 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తోడయ్యారు.


నదుల్లో 15-20% మధ్య ప్రవాహాలు తప్పనిసరిదేశవ్యాప్తంగా నదుల్లో 15 నుంచి 20 శాతం మధ్య నీటి ప్రవాహాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జీవనోపాధికి, పర్యావరణ పరిరక్షణ చర్యల నిమిత్తం నదుల్లో కొంత లోతు మేర స్వచ్ఛమైన నీటిని లభ్యమయ్యేలా 15 నుంచి 20 శాతం నదుల ప్రవాహాలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలకు ఏ రాష్ట్రమైనా కట్టుబడి ఉండటం సాధ్యం కాకపోతే ఆ రాష్ట్రం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను కలవొచ్చని సూచించింది.
 

2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవారాలంటే.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.6.4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయడింది. ఈ మేరకు ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబ ఆదాయం రూ.96,703గా ఉంది. దీన్ని 2022-23 నాటికి రూ.2,19,724లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీరేటు - రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. అదే విధంగా బ్యాంకులు తమ వద్ద స్వల్పకాలికంగా ఉంచే అదనపు నిధులకు సంబంధించి చెల్లించే రేటు- రివర్స్ రెపోను కూడా పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.75 శాతానికి తగ్గింది. దాదాపు పది నెలల నుంచీ ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలతో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్‌బీఐ, ప్రస్తుతం ఈ భయాలు తగ్గడంతో రెపో రేటు పావుశాతం తగ్గించినట్లుగా వివరించింది. వృద్ధికి ఇది భరోసా కల్పిస్తున్న అంశంగా పేర్కొంది. 
తగ్గనున్న ఈఎంఐ భారం రెపో తగ్గింపు ద్వారా లభిస్తున్న ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వల్ల గృహ, ఆటో, కార్పొరేట్ల నెలవారీ రుణ పునః చెల్లింపుల (ఈఎంఐ) భారం కొంత తగ్గుతుంది. 
మరిన్ని ముఖ్యాంశాలు.. 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా 7.3 శాతంగా కొనసాగింపు.
  • బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం- 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎటువంటి మార్పు లేదు.
  • 6.25 శాతానికి దిగివచ్చిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్), బ్యాంక్ రేటు.
  • ప్ల్లస్ 2 లేదా మైనస్ 2 శ్రేణితో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం లక్ష్యాలను కొనసాగించడంపై దృష్టి.
  • 2017 జూలై 28కి 392.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు.
  • ఆర్‌బీఐ తదుపరి పరపతి విధాన సమీక్ష 2017 అక్టోబర్ 3, 4 తేదీల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక సమావేశం) జరుగుతుంది.


కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్-22’‘భారత్-22’ పేరుతో కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్-22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 4న ప్రకటించారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. 
భారత్-22 జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్-22లో చేర్చారు. 
మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే.. ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదే తరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది. 


11.4 లక్షల పాన్‌కార్డులు డీయాక్టివేట్ దేశవాప్తంగా 11.4 లక్షల పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం క్రియారహితం (డీయాక్టివేట్) చేసింది. అందులో కొన్నింటిని రద్దు కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నంబరుతో అనుససంధానం చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది. 
డీయాక్టివ్ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ విభాగం ఇ- ఫిల్లింగ్ వెబ్‌సైట్‌ని సందర్శించండి. అందులో ’Know Your Pan’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ పేజీ వస్తుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జాగ్రత్తగా పూర్తిచేసి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది. 


ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధిపెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించింది. 
వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుండా) అడ్వాన్స్‌ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నాటికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి. 








జులై 2017 ఎకానమీ

గ్యాస్‌పై నెలకు రూ.4 పెంపు : కేంద్రంసబ్సిడీపై అందించే వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరలను ఇక నుంచి ప్రతి నెలా పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నెలకు రూ.4 చొప్పున పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించింది. 2018 మార్చి కల్లా ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31న లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గ్యాస్ సిలిండర్లపై ప్రతినెలా రూ.4 పెంపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 


బ్యాంకు ఖాతా నంబరు పోర్టబిలిటీకి ఆర్‌బీఐ సూచన మొబైల్ నంబరు పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకు అకౌంటు నంబరు పోర్టబిలిటీ అమలు చేసే దిశగా బ్యాంకులు కసరత్తు చేయాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా సూచించారు. మరింత పోటీతత్వంతో పనిచేసేందుకు, ఖాతాదారులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ అంబుడ్‌‌సమన్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ముంద్రా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆర్‌బీఐ జూలై 31న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 


వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ‘ఈ-రకం’వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లో అమ్మేందుకు ఉపకరించే ఈ-రకం అనే పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ప్రారంభించింది. ప్రభుత్వ వేలందారు ఎంఎస్‌టీసీ, కేంద్ర గిడ్డంగుల సంస్థకు చెందిన సీఆర్‌డబ్ల్యూసీలు సంయుక్తంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్‌తో కలసి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు.


బ్యాంకులకు 2.4 లక్షల కోట్ల హెయిర్ కట్: క్రిసిల్భారీగా పేరుకుపోయిన 50 మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు సుమారు రూ.2.4 లక్షల కోట్లు (60 శాతం) వదులుకోవాల్సి (హెయిర్‌కట్) రావొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. మెటల్స్, నిర్మాణ, విద్యుత్ రంగాలకు చెందిన ఈ బకాయిలు బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకున్న మొత్తం రూ.8 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో దాదాపు సగం. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు అప్పులిచ్చిన బ్యాంకులు ఆయా సంస్థల ఆస్తుల్ని విక్రయించుకున్నా వాటికి 40% మొత్తమే దక్కుతుందని తెలిపింది.

2017లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతం: ఏడీబీగతంలో అంచనా వేసిన 7.4% వృద్ధి రేటు సాధన దిశగా భారత్ ముందుకెళుతోందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదే రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. అటు ఆసియా ప్రాంత వృద్ధి రేటు అంచనాలను మాత్రం గతంలో ప్రకటించిన 5.7% నుంచి 5.9%కి పెంచుతున్నట్లు తెలిపింది. ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) 2017 నివేదికకు అనుబంధ నివేదికలో వర్ధమాన ఆసియా దేశాలకు సంబంధించి అంచనాలను ఈ మేరకు సవరించింది. 
2018లో వర్ధమాన ఆసియా వృద్ధిని 5.7% నుంచి 5.8%కి పెంచింది. ఇక 2017-18లో భారత వృద్ధి 7.4% ఉండగలదని, 2018-19లో 7.6%కి పెరగగలదని ఏడీబీ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాల నిర్వహణ సులభతరం కావడానికి, వృద్ధికి ఊతమివ్వడానికి వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) దోహదపడగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. 

ఏటీఎంలో ఐసీఐసీఐ పర్సనల్ లోన్స్ఐసీఐసీఐ బ్యాంకు రుణ మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను తక్షణం అందించే విధానాన్ని ప్రారంభించింది. వేతన అకౌంట్ కలిగి ఉన్న వారికి ఈ అవకాశం కల్పించింది. క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలు అందించే సిబిల్ స్కోర్ సమాచారం ఆధారంగా ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌కు అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వీరికి ఏటీఎంలో లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణ అర్హతకు సంబంధించిన ఒక మేసేజ్ కనిపిస్తుంది. రుణం తీసుకోవాలని భావిస్తే ఐదేళ్ల కాలపరిమితితో రూ.15 లక్షల వరకు మొత్తాన్ని పొందొచ్చు. ఇది కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. 


రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ అందిస్తామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జూలై 22న ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఏజీఎం సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. 
జియో ఫోన్‌ను ముకేశ్ అంబానీ ‘ఇంటెలిజెంట్ ఫోన్’గా అభివర్ణించారు. అంతేకాదు ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’ అనేది జియో ఫోన్ నినాదం. ఈ ఫోన్ పొందేందుకు వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మూడేళ్ల తర్వాత(36 నెలలు) తిరిగి ఇస్తారు. జీవిత కాలం పాటు వాయిస్ కాలింగ్ ఉచితం. నెలకు రూ.153 చొప్పున టారిఫ్‌ను చెల్లిస్తే... అపరిమిత డేటా సేవలను పొందొచ్చు. ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా ఈ ఫోన్‌లను ప్రవేశపెడతామని ముకేశ్ ప్రకటించారు.

2016లో 18 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్‌‌స వ్యాధితో మరణించేవారి సంఖ్య తగ్గుతున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ ఎయిడ్స్’ విభాగం తెలిపింది. 2005లో దాదాపు 19 లక్షల మంది ఈ వ్యాధితో మరణించగా.. 2016 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు తగ్గిందని తన నివేదికలో వెల్లడించింది. చాలామంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. గతేడాది కొత్తగా 18 లక్షల హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయినట్లు పేర్కొంది. 
ఒక్క 2016లోనే 1.95 కోట్ల మందికి యాంటీ రెట్రోవైరల్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మైఖేల్ సిడిబే తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7.61 కోట్ల మందికి హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకగా.. దాదాపు 3.5 కోట్ల మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలు ఇన్ఫెక్షన్ అదుపులో గణనీయమైన పురోగతి సాధించినట్లు వివరించారు. 2010 నుంచి ఈ ప్రాంతంలో ఎయిడ్స్ మరణాలు 42 శాతం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 
కాగా 2016లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నమోదైన 95 శాతం హెచ్‌ఐవీ కేసులు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని 10 దేశాల నుంచే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఈ పది దేశాల్లో భారత్, చైనా, పాకిస్తాన్ ఉన్నాయి. 

వయ వందన యోజన పథకం ప్రారంభం వయోవృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ (పీఎంవీవీవై) పేరుతో ఎల్‌ఐసీ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూలై 21న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దీన్ని తీసుకోవచ్చు. 60 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు వర్తించే ఈ పథకంలో 10 ఏళ్ల పాటు 8 శాతం వార్షిక రిటర్నులు లభిస్తాయి. వడ్డీ ఆదాయాన్ని ప్రతి నెల, లేదా 3 నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి పొందే వీలుంటుంది. ఈ సంవత్సరం మే 4న ప్రారంభమైన ఈ పెన్షన్ పథకంలో 2018 మే 3వ తేదీ వరకు చేరవచ్చు. ఈ పథకానికి జీఎస్టీ వర్తించదు. 
 

భారత వృద్ధి అంచనా యథాతథంఅంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో భారత వృద్ధి రేటు అంచనాను యథాతథంగా(7.2 శాతంగా) కొనసాగించింది. ఇది 2018-19లో 7.7 శాతానికి చేరుతుందని జూలై 24న విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) అప్‌డేట్ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లు భారత వృద్ధిరేటు చైనా కంటే అధికంగానే ఉండనుంది. చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగా, 2018లో 6.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ గతంలో ప్రకటించింది. గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. అయితే భారత వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైంది. అయితే ఇది ఊహించిన దానికంటే అధికమని ఐఎంఎఫ్ పేర్కొంది.

ఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్ 
ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్‌సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. 
ఆర్‌సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్‌ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ-1900డి విమానాలను సమకూర్చుకున్నాయి. 
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసింది. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది.


జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22ను కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా జూలై 12న ఆవిష్కరించారు. 2027 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. ఈ సారి ప్రణాళికల అమలులో భాగంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలపై అధిక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. 
2030 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ (NFME)ని 2016లో ప్రారంభించింది. 
2017-22 ప్రణాళికలు
  • మలేరియా వ్యాప్తిని గుర్తించే వ్యవస్థల బలోపేతం
  • మలేరియా వేగంగా వ్యాప్తి చెందకుండా గుర్తించిన వెంటనే నిర్మూలించే వ్యవస్థల ఏర్పాటు
  • Long Lasting Impregnated Nets ద్వారా మలేరియా నివారణపై అవగాహన
  • దోమల నివారణకు వ్యవస్థల బలోపేతం


ఆరోగ్య ఖర్చులపై ఐసీఆర్‌డబ్ల్యూ సర్వే దేశంలో రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలకు అడ్డుకట్టవేస్తే ఆరోగ్య సంబంధిత వ్యయాల్లో రూ.33,500 కోట్లు ఆదా అవుతాయని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ (ఐసీఆర్‌డబ్ల్యూ) సర్వే వెల్లడించింది. ఈ మొత్తం 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధుల(రూ.33,329 కోట్లు)తో సమానం. అలాగే... 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలను నియంత్రించడం వల్ల రూ.1.14 లక్షల కోట్లు ఆదా అవుతాయని తెలిపింది. ఇందులో భారత్ నుంచి ఆదా అయ్యే మొత్తం సుమారు రూ.65,000 కోట్లు(62 శాతం) అని పేర్కొంది. 
మొత్తంగా 106 దేశాల్లో బాల్య వివాహాలను తగ్గించడం వల్ల 2030 నాటికి ఏటా రూ.37 లక్షల కోట్లు ఆదా అవుతాయని వెల్లడించింది. 


2.5 కోట్లకు చేరిన ఉజ్వల లబ్ధిదారులుపేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ అందించే ఉద్దేశంతో 2016 మేలో కేంద్రం ప్రారంభించిన ఉజ్వల ఎల్‌పీజీ పథకం 2.5 కోట్ల మందికి చేరువైంది. బెంగాల్‌కు చెందిన ఓ మహిళకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 15న ఇచ్చిన కనెక్షన్‌తో లబ్ధిదారుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరింది. 

జూన్‌లో 0.90 శాతంగా నమోదైనటోకు ద్రవ్యోల్బణంకూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 8 నెలల కనిష్టానికి చేరింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.90 శాతంగా నమోదైంది.

రూ.2కే స్పైస్ జెట్‌ను దక్కించుకున్న అజయ్ సింగ్ రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ మళ్లీ తన చేతుల్లోకి తీసుకొని అభివృద్ధి చేశాడు. అయితే... మారన్‌ల నుంచి కొనుగోలు చేసేందుకు అజయ్ సింగ్ చెల్లించింది కేవలం రెండు రూపాయలే. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే దక్కించుకున్నారు. దేశీ కార్పొరేట్ చరిత్రలో ఏ లిస్టెడ్ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు. 
2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు. అప్పట్లో స్పైస్‌జెట్ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్ మారన్ వాటా విలువ రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది.
బయట పడిందిలా..అప్పట్లో డీల్ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్లడించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్ కంపెనీ చేతులు మారిపోయింది. ప్రస్తుతం డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఈ సమాచారం బయటికొచ్చింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్ ఎయిర్‌వేస్ నుంచి సింగ్ చేతికి వచ్చాయి. 


జీఎస్‌టీ సందేహాల నివృత్తికి యాప్వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లపై వినియోగదారుల సందేహాల్ని నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘జీఎస్‌టీ రేట్స్ ఫైండర్’ (GST Rates Finder) పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ జూలై 9న ప్రారంభించారు. దీని ద్వారా ఏయే వస్తువులపై ఎంత పన్ను విధిస్తున్నారన్న పూర్తి సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు. అలాగే సేవలపై పన్ను రేట్లు కూడా లభ్యమవుతాయి. 


చేనేత కార్మికుల జనాభా సేకరణ ప్రారంభంచేనేత కార్మికుల వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, వారి సంక్షేమం కోసం విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం నాలుగో జాతీయ చేనేత జనాభా లెక్కల సేకరణను జూలై 8న ప్రారంభించింది. చేనేత అనుబంధ కార్మికుల వివరాలను కూడా సేకరించనున్న ఈ ప్రక్రియలో కార్మికులకు ఫొటో గుర్తింపు కార్డులు అందజేస్తారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఈ కార్డులు అర్హత కల్పిస్తాయి. ఈ ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తికానుంది. 
2009-10 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 43.31 లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు.


2026 నాటికి పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి భారత్ మరో దశాబ్ద కాలానికి భారత్ పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి చేరుకుంటుందని అమెరికాకు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) నివేదిక వెల్లడించింది. 2026 నాటికి భారత్ పాల ఉత్పత్తిలో మిగతా దేశాలకంటే ముందు వరుసలో నిలుస్తుందని నివేదికలో పేర్కొంది. పదేళ్లలో ప్రపంచ జనాభా 730 నుంచి 820 కోట్లకు పెరుగుతుందని, భారత్, ఆఫ్రికా దేశాల్లో 56 శాతం జనాభావృద్ధి నమోదవుతుందని నివేదిక వెల్లడించింది. అంటే.. భారతదేశ జనాభా 130 కోట్ల నుంచి దాదాపు 150 కోట్లకు పెరగవచ్చని అంచనా వేసింది. చైనా జనాభాను మించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొంది. మానవ వనరులే పెట్టుబడిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో భారత్, మరికొన్ని ఆఫ్రికా దేశాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తాని నివేదికలో అభిప్రాయపడింది. అంతేకాక ఆహార ఉత్పత్తులతోపాటు ఇతర అవసరాల కోసం ఈ దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని, వీటిని నెరవేర్చేందుకు తీసుకునే చర్యల ఫలితంగా ఎన్నో రంగాల్లో ఈ దేశాలు ముందంజలో నిలుస్తాయని నివేదిక ద్వారా తెలిపింది. 


పాన్‌తో ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి 
జూలై 1 నుంచి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)తో ఆధార్ కార్డును తప్పనిసరిగా జతచేయాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పాన్ కార్డుకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్‌ను గానీ, లేదా ఆధార్‌లో నమోదు చేసుకున్నట్లు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను గానీ తప్పనిసరిగా అనుసంధానించాలి. ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసే సమయంలోగానీ, బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసే సమయంలో గానీ పాన్, ఆధార్‌లు తప్పనిసరిగా అనుసంధానించాల్సిందే. వ్యక్తుల ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండేందుకు గాను ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 


ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు జూన్ 28న కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. 
ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు రూ.30,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా ఆదుకుంది. మరోవైపు ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. 

వస్తు, సేవల పన్ను విధానం ప్రారంభం ఒక దేశం ఒకే పన్ను నినాదంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రారంభమైంది. దేశ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణగా నిలిచిపోయే ఈ పన్నును జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఇది ఏ ఒక్క పార్టీ, ఒక్క ప్రభుత్వం ఘనత కాదని, భవ్య భారతం కోసం సమష్టిగా చేసిన కృషి ఫలితమని ప్రధాని ఉద్ఘాటించారు. జీఎస్టీని ‘ఉత్తమమైన, సరళమైన పన్ను’గా అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్య పరిణతికి జీఎస్టీ ఓ సాధికార రూపమని రాష్ట్రపతి పేర్కొన్నారు. 
ఎరువులపై 5 శాతం జీఎస్టీజీఎస్టీ అమలుకు కొద్ది గంటల ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై రైతులకు సంబంధించిన రెండు అంశాలపై పన్నురేటును తగ్గించింది. గతంలో 12 శాతం పరిధిలో ఉన్న ఎరువులను 5 శాతం పరిధిలోకి.. 28 శాతంగా ఉన్న ట్రాక్టర్ల విడిభాగాలను 18 శాతంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. 
18 సమావేశాలు..2016 సెప్టెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి సమావేశమైంది. ఆనాటి నుంచి నేటి వరకు 18 సార్లు ఈ మండలి సమావేశమైంది. విసృ్తతమైన అంశాలపై కూలంకశంగా చర్చించి 5, 12, 18, 28 శాతం పన్ను పరిధిని నిర్ణయించింది. 


2018 నాటికి 10.2 శాతానికి ఎన్‌పీఏలు : ఆర్‌బీఐ 2017 మార్చి నాటికి 9.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 2018 మార్చి నాటికి 10.2 శాతానికి చేరే అవకాశం ఉందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ జూన్ 30న తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
నివేదికలోని ముఖ్యాంశాలు..
  • నికర మొండిబకాయిల (ఎన్‌ఎన్‌పీఏ) రేషియో 2016 సెప్టెంబర్‌లో 5.4 శాతం ఉంటే, 2017 మార్చినాటికి ఈ రేటు 5.5 శాతానికి పెరిగింది.
  • ఒత్తిడిలో ఉన్న రుణ నిష్పత్తి (స్ట్రెస్డ్ అడ్వాన్సెస్ రేషియో) మాత్రం 12 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసింది. వ్యవసాయం, సేవలు, రిటైల్ రంగాల్లో ఈ తరహా రుణ నిష్పత్తి తగ్గితే, పారిశ్రామిక రంగం విషయంలో మాత్రం 22.3 శాతం నుంచి 23 శాతానికి చేరింది.
  • ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం-ద్రవ్యలోటు 2016-17లో 3.5 శాతంగా ఉంటే, ఇది 2017-18లో 3.2 శాతానికి తగ్గుతుందని అంచనా.

2016-17లో 55 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు 55 శాతం పెరిగాయని నీతి ఆయోగ్ జూలై 3న వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ విధానం మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్‌లో 500, 1000 రూపాయిల నోట్లు రద్దు చేయటంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. 
2011-12 నుంచి 2015-16 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు ఏటా సగటున 28 శాతం మేర పురోగతి నమోదు చేశాయని నీతి ఆయోగ్ వెల్లడించింది.