Thursday, 28 June 2018

మే 2018 ఎకానమీ

జాతీయ వెదురు మిషన్ ఏర్పాటుకు ఆమోదం 
పునర్వ్యవస్థీకృత జాతీయ వెదురు మిషన్ (ఎన్‌బీఎం) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు అమలు చేయనున్న ఈ పథకానికి రూ.1,290 కోట్లు కే టాయించగా ఇందులో కేంద్రం రూ.950 కోట్లు భరిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు.
ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ముడి జనపనార ధర రూ.3,700కు చేరింది.


భారత్‌కు బీబీబీ మైనస్’ గ్రేడ్: ఫిచ్
భారత్‌కు వరుసగా 12వ ఏడాదీ పెట్టుబడులకు తక్కువ గ్రేడ్ అయిన ‘బీబీబీ మైనస్’ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ కొనసాగించింది. భారత దీర్ఘకాలిక కరెన్సీ జారీ డిఫాల్టింగ్ రేటును ‘బీబీబీ- స్థిరం’గా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. భారత ఆర్థిక రంగం పలు పోటీ దేశాలతో పోల్చినప్పుడు తక్కువ అభివృద్ధి, ప్రపంచ బ్యాంకు గవర్నెన్స్ సూచీలో తక్కువ స్కోరు సాధించిందని, ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలోనూ వెనుకబడిందని ఫిచ్ పేర్కొంది. మధ్యకాలిక బలమైన వృద్ధి అంచనాలు, సానుకూల ఎక్స్‌టర్నల్ బ్యాలన్స్లు, బలహీన ద్రవ్య పరిస్థితులు, సంస్థాగత అంశాల వెనుకబాటు ఆధారంగా ఫిచ్ ఈ రేటింగ్‌ను ఇచ్చింది.

ఏప్రిల్ 2018 ఎకానమీ

జన్‌ధన్ ఖాతాల్లో 80 వేల కోట్ల డిపాజిట్లుజన్‌ధన్ యోజన కింద బ్యాంకుల్లో ప్రారంభమైన ఖాతాల్లో డిపాజిట్లు రూ.80,545 కోట్లకు చేరాయి. జీరో బ్యాలన్స్తో బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని 2014 ఆగస్ట్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో ఏప్రిల్ 11 నాటికి ఖాతాల సంఖ్య 31.45 కోట్లకు చేరుకోగా అందులో డిపాజిట్ అయిన మొత్తం రూ.80,545 కోట్లకు చేరింది.


వంద బిలియన్ డాలర్ల కంపెనీగా టీసీఎస్
వంద బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ (రూ.6,60,000 కోట్లు) సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కు అందుకున్న వాటిలో 64వ కంపెనీగా నిలిచింది. మొత్తం సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో టీసీఎస్ వాటా 11 శాతంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2007లో వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. 
1970లో కార్యకలాపాలు ప్రారంభించిన టీసీఎస్ 2004లో మొదటిసారిగా ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చింది. టాటా గ్రూప్ ఆదాయంలో 85 శాతం వాటా కలిగి ఉన్న ఈ సంస్థలో 130 దేశాలకు చెందిన 3,87,200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.


రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం ప్రారంభం
పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ)’ పథకం ప్రారంభమైంది. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకంలో భాగంగా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు వాటి స్వయం సమృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి కృషిచేస్తారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు జన్ ధన్, వన్ ధన్, గో ధన్ (మానవ వనరుల, అటవీ సంపద, గో సంపద)పై దృష్టిపెట్టాలని మోదీ సూచించారు.


భారత్‌కు 8.1 మిలియన్ల ఉద్యోగాలు అవసరం
ప్రపంచ బ్యాంకు రెండేళ్లకోసారి విడుదల చేసే సౌ త్ ఏషియా ఎకనమిక్ ఫోకస్(ఎస్‌ఏఈఎఫ్) నివేదికను ‘ఉపాధిలేని వృద్ధి’ పేరుతో ఏప్రిల్ 16న విడుదల చేసింది. ఇందులో భారత్‌కు ఏటా 8.1 మిలియన్ల ఉద్యోగాలు అవసరమని వెల్లడించింది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 7.3 శాతంగా అంచనా వేసింది.

వృద్ధి రేటును 7.4 శాతంగా పేర్కొన్న ఐఎంఎఫ్
భారత్ 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతం వృద్ధి రేటు ను నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు.. వరుసగా 6.6 శాతం, 6.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం: ఏడీబీభారత్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఏప్రిల్ 11న తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటును 7.6 శాతంగా విశ్లేషించిన ఏడీబీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని వివరించింది. 
ఏడీబీ 2018 అవుట్‌లుక్‌లో 2018లో భారత్‌లో ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం, 2019లో 5 శాతం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లో తొలుగుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ వంటి పలు సంస్కరణలు భారత్ వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది. దీని వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా ఆకర్షించగలుగుతుందని వివరించింది. ఇటీవల వ్యాపార అవకాశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన గ్లోబల్ ర్యాంక్‌లో భారత్ 130 నుంచి 100కు చేరిన విషయం తెలిసిందే. 


రత్నగిరిలో సౌదీ ఆరామ్‌కో రిఫైనరీ
ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థ, సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. మహారాష్ట్రలోని రత్నగిరి (బాబుల్‌వాడి) లో నిర్మించనున్న ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కన్సార్షియమ్‌లో భాగస్వామ్యం దక్కించుకుంది. ఈ మేరకు 16వ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరమ్ మినిస్టీరియల్ సమావేశంలో ఐవోసీ, బీపీసీఎల్ మరియు హెచ్‌పీసీఎల్ తో కుదిరిన ఒప్పందంపై సౌదీ అరేబియా ఇంధన మంత్రి ఖలీద్ అల్- ఫలిహ్ సంతకాలు చేశారు. 14,000 ఎకరాల్లో 60 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించే ఈ రిఫైనరీని 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
4,400 కోట్ల డాలర్లతో నిర్మించనున్న ఈ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌పీసీఎల్) రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రాసెస్ చేస్తుంది. ఏడాదికి 18 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను అందించగలదు. ఈ కన్సార్షియమ్‌లో సౌదీ ఆరామ్‌కో కంపెనీకి 50 శాతం వాటా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియమ్ కంపెనీ, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్‌లకు కలపి 50 శాతం చొప్పున వాటాలుంటాయి. 


ఎఫ్‌డీఐలకు అనుకూల దేశాల్లో భారత్
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అత్యంత అనుకూల దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తున్నట్లు స్విట్జర్లాండ్ ఆర్థిక సేవల సంస్థ, యూబీఎస్ ప్రకటించింది. కొనసాగుతున్న వ్యవస్థాగత సంస్కరణల కారణంగా భారత్‌లో ఎఫ్‌డీఐలు పెరుగుతున్నాయని తన తాజా నివేదికలో పేర్కొంది. 2017 అక్టోబర్, నవంబర్ లో అమెరికాలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు నాలుగో వంతు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. వీటి ద్వారా ఐదేళ్లలో 7,500 కోట్ల డాలర్ల మేర ఎఫ్‌డీఐలు భారత్‌లోకి రానున్నట్లు అంచనా.


భారత బ్యాంకుల్లో పాలనా వైఫల్యాలు: ఎస్ & పీ
భారత బ్యాంకుల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు బ్యాంకింగ్ వ్యవస్థలో పాలనా వైఫల్యాలను ఎత్తి చూపేలా ఉన్నాయని ఎస్‌అండ్ పీ గ్లోబల్ రేటింగ్‌‌స వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్ వ్యవస్థ రిస్క్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ విధానాలను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని తన నివేదికలో తెలిపింది.


30 వేల కోట్లకు నాబార్డ్ అధీకృత మూలధనం
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ అధీకృత మూలధనాన్ని రూ.5,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచింది. దీంతో గ్రామీణాభివృద్ధి, సాగుకు మరిన్ని రుణాలు అందించడం ద్వారా తన కార్యకలాపాలు పెంచుకునేందుకు నాబార్డ్‌కు వీలు పడనుంది.

భారత్ వృద్ధి 7.4 శాతం: ఐఎంఎఫ్
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2018-19లో ఇది 7.8 శాతానికి చేరుకుని భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక రంగంపై అంచనాలను ఐఎంఎఫ్ ఏప్రిల్ 17న వెలువరించింది. ఇదే కాలానికి చైనా వృద్ధి రేటు 6.6%, 6.4%గానే ఉంటుందని తెలిపింది. 


2018లో సాధారణ వర్షపాతం: ఐఎండీ
దేశంలో గత రెండేళ్ల మాదిరిగానే 2018లో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతవరణ శాఖ (ఐఎండీ) ఏప్రిల్ 16న ప్రకటించింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే 2018లో 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ డెరైక్టర్ జనరల్ కేజే రమేశ్ వాతావరణ విభాగం తొలివిడత అంచనాలను విడుదల చేశారు. 


ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్‌కు 130వ స్థానం
అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ 180 దేశాలతో రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్‌కు 130వ స్థానం దక్కింది. కాగా, 2017తో పోల్చితే భారత్ 13 స్థానాలను మెరుగుపరుచుకోగా, చైనా ఒక స్థానం ఎగబాకి 110వ ర్యాంకు పొందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 43 దేశాల్లో భారత్‌కు 30వ స్థానం దక్కింది.

దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఏప్రిల్ 10న దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బెరై గౌడ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. రాష్ట్రాలకు నిధుల పంపిణీకి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం విధివిధానాలు వివక్షపూరితంగా ఉన్నాయని.. వాటిని రద్దు చేసి కొత్త విధానాలను రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. తమిళనాడు, తెలంగాణ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

ఆర్‌బీఐ పాలసీరేట్లు యథాతథం కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) ని 4 శాతంగా కొనసాగించింది. ఏప్రిల్ 5న జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ ఈ మేరకు నిర్ణయించింది. 
ఎంపీసీ మొదటి ఆరు నెలల కాలానికి ద్రవ్యోల్బణ అంచనాలను 4.7-5.1 శాతానికి తగ్గించింది. ఫిబ్రవరిలో జరిగిన పాలసీ సమీక్షలో దీనిని 5.1-5.6 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో ద్రవ్యోల్బణం 4.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.
వృద్ధి అంచనాల కొలమానానికి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విధానం నుంచి ఆర్‌బీఐ మళ్లీ పూర్వపు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) విధానానికి మళ్లింది. కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి నుంచి వృద్ధి అంచనాల విశ్లేషణకు జీవీఏ విధానాన్ని వినియోగిస్తోంది.
పాలసీ ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతం, రివర్స్ రెపో రేటు 5.75% 
2018 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ద్రవ్యోల్బణం అంచనా 4.7-5.1% 
2019 మార్చి వరకు ద్రవ్యోల్బణం అంచనా 4.4% 
జీడీపీ వృద్ధి అంచనాలు 7.4 శాతం 
తదుపరి పాలసీ సమీక్ష జూన్ 6న.


బిట్ కాయిన్ సంస్థలకు సేవలు వద్దు: ఆర్‌బీఐ
బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో లావాదేవీలు జరిపే సంస్థలకు సేవలను కొనసాగించవద్దని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపు సేవల సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎండ్-టు-ఎండ్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సహా యూజర్ల నుంచి సేకరించిన మొత్తం డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు తెలిపింది.


ఇండోర్‌లో ఆసియా, పసిఫిక్ ప్రాంతీయ 3ఆర్ సదస్సు
ఆసియా, పసిఫిక్ ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్ సదస్సు ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఇండోర్‌లో జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభిస్తారు. జపాన్ పర్యావరణ శాఖ మంత్రి తదహికో ఇటోతో పాటు పలు దేశాల నుంచి 40 మంది మేయర్లు, భారత్ నుంచి 100 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరవుతారు.
ఈ సందర్భంగా ‘3ఆర్’ అనే అభివృద్ధి మంత్రాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 3ఆర్ అంటే తక్కువ వినియోగం (రెడ్యూస్), పునర్వినియోగం (రీయూజ్), శుద్ధి చేసి వినియోగించడం (రీసైకిల్). ఆసియా-పసిఫిక్ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి అందించాలన్నది ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.

ఉదయ్ కోటక్ కమిటీ సిఫార్సులకు సెబీ ఆమోదంకంపెనీల్లో కార్పొరేట్ నైతికతను (గవర్నెన్‌‌స) కట్టుదిట్టం చేసేందుకు ఉదయ్ కోటక్ కమిటీ చేసిన సిఫార్సులను సెబీ మార్చి 28న ఆమోదించింది. కమిటీ మొత్తం 80 సిఫార్సులు చేయగా... వాటిలో 80 శాతాన్ని సెబీ ఆమోదించింది. ఇందులో లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును రెండుగా విభజించడం, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పథకాలపై అదనపు చార్జీలను తగ్గించడం, ఈక్విటీ డెరివేటివ్‌‌స మార్కెట్‌ను మరింత పటిష్టం చేయడం, కంపెనీల టేకోవర్ నిబంధనల్లో సవరణలు వంటి ప్రతిపాదనలున్నాయి.
సెబీ ఆమోదించిన సిఫార్సులు
  • లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును సీఈఓ/ఎండీ, చైర్మన్‌గా విభజించనున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) ఆధారంగా టాప్- 500 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు.
  • 2019 ఏప్రిల్ 1 నాటికి టాప్-500 లిస్టెడ్ కంపెనీలన్నీ కచ్చితంగా కనీసం ఒక స్వతంత్ర మహిళా డెరైక్టర్‌ను నియమించాల్సి ఉంటుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి టాప్-1000 లిస్టెడ్ కంపెనీలకు దీన్ని అమలు చేస్తారు.
  • టాప్-1000 లిస్టెడ్ కంపెనీల్లో 2019 ఏప్రిల్ 1 నుంచి కనీసం ఆరుగురు డెరైక్టర్లు ఉండాలి. 2020 ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనను టాప్-2000 లిస్టెడ్ కంపెనీలకు వర్తింపజేస్తారు.
  • ఒక వ్యక్తి ఎనిమిది లిస్టెడ్ కంపెనీల వరకూ మాత్రమే డెరైక్టర్‌గా ఉండొచ్చుననే నిబంధన ఏప్రిల్ 1, 2019 నుంచి అమల్లోకి వస్తుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఏడుకు తగ్గిస్తారు. ప్రస్తుతం ఒక వ్యక్తి 10 కంపెనీల్లో డెరైక్టర్ పదవిలో ఉండేందుకు అవకాశం ఉంది.
  • స్వతంత్ర డెరైక్టర్ల అర్హత, ఆడిట్, రెమ్యూనరేషన్ (పారితోషికం), రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీల్లో మరింత పాత్ర ఉండేవిధంగా నిబంధనల్లో మార్పు చేశారు.
  • స్టాక్ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్ కు ప్రమోటర్ల వాటాలను ఫ్రీజ్ చేయనున్నారు. నిబంధనలను సరిగ్గా పాటించని కంపెనీల షేర్లలో ట్రేడింగ్ ను సస్పెండ్ చేస్తారు.
  • క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూల ద్వారా సమీకరించే నిధులను ఎలా వినియోగించారనే సమాచారాన్ని కంపెనీలు ఇకపై కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది.
  • ఆడిటర్ల వివరాలు, వాళ్లకిచ్చే ఫీజు, రాజీనామా చేస్తే దానికి గల కారణాలతో పాటు డెరైక్టర్ల నైపుణ్యం, అనుభవం వంటి అంశాలన్నీ కంపెనీలు కచ్చితంగా బహిర్గతం చేయాలి.
  • లిస్టెడ్ కంపెనీలు, వాటికి సంబంధించిన అన్‌లిస్టెడ్ సంస్థల్లో సెక్రటేరియల్ ఆడిట్ కూడా ఇకపై తప్పనిసరి. అదేవిధంగా లిస్టెడ్ కంపెనీలన్నీ 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి కన్సాలిడేటెడ్ త్రైమాసిక ఫలితాలను కచ్చితంగా ప్రకటించాలి.
  • దివాలా చట్టం (ఐబీసీ) ప్రకారం సంబంధిత కంపెనీల్లో కనీస పబ్లిక్ వాటా, ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్, ప్రమోటర్ల పునర్‌విభజన వంటి అంశాల్లో అదనంగా మరింత సమాచారాన్ని వెల్లడించాలి.


ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్విడ్ ప్రో కో దుమారం
దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ సీఈవో, ఎండీ చందా కొచర్ క్విడ్ ప్రో కో కు పాల్పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
చందా కొచర్ భర్త దీపక్ కొచర్, మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్ గ్రూప్ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్... అనతికాలంలోనే కేవలం రూ.9 లక్షలకే న్యూపవర్‌లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్ కొచర్‌కి బదలాయించేశారు. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ఇదంతా జరిగింది. వీడియోకాన్ తీసుకున్న రుణ మొత్తంలో ఇప్పటికీ 86 శాతం భాగం (సుమారు రూ.2,810 కోట్లు) మొండి బకాయిల్లో చేరింది.


‘ఈ-వే బిల్లు’ ప్రారంభంరెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారానికి సంబంధించిన ఈ వే బిల్లు వ్యవస్థ ఏప్రిల్ 1 వ తేది నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చింది. రూ.50 వేల విలువ దాటిన సరుకులు రవాణా చేయాలంటే ఈ-వే బిల్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే ఒకే రాష్ట్రంలో జరిగే వ్యాపారాల్లో ప్రస్తుతానికి ఈ-వే బిల్లు అవసరం లేదు. జూన్ 1 నుంచి దీనికి కూడా ఈ-వే బిల్లును వర్తింపచేయనున్నారు. ఈ-వే బిల్లుతో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకులను రవాణా చేసుకునే వీలు కలుగుతుంది.
అయితే నాన్ మోటార్ వాహనాల ద్వారా రవాణా చేసే సరుకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు రైలులో రవాణా చేసేవి, రక్షణ శాఖ, కస్టమ్స్‌లకు సంబంధించిన సరుకులు, ఖాళీ కంటెయినర్లను ఈ-వే బిల్లుల నుంచి మినహాయించారు. నేపాల్, భూటాన్ దేశాలకు సంబంధించిన ఎగుమతులు, దిగు మతులకు కూడా ఈ-వే బిల్లు అవసరం లేదు.


ఉపాధి కూలీల వేతనం పెంపుఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడున్న రూ.197ల వేతనాన్ని రూ.205లకు పెంచుతున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అపరాజిత సారంగి పేర్కొన్నారు. రేట్ల పెంపు తర్వాత అత్యధికంగా రోజువారీ కూలీని హర్యానాలో రూ. 281, అత్యల్పంగా బిహార్, జార్ఖండ్ రూ.168 చొప్పున చెల్లిస్తున్నారు. పెరిగిన వేతనం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వస్తుంది.


నీతి ఆయోగ్ జిల్లా ర్యాంకుల్లో అట్టడుగున మెవత్దేశంలో అత్యంత వెనుకబడిన 101 జిల్లాల ర్యాంకులను నీతి ఆయోగ్ మార్చి 28న విడుదల చేసింది. ఈ జిల్లాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ‘ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్’ కార్యక్ర మంలో ఉన్నాయి. కాగా, తాజా ర్యాంకుల్లో హరియాణలోని మెవత్ అత్యంత వెనుకబడిన జిల్లాగా నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం అత్యుత్తమ పనితీరు కనబరచింది. మెవత్ తర్వాత మధ్యప్రదే శ్‌లోని సింగురౌలి, తెలంగాణలోని కుమ్రంభీమ్ అసిఫాబాద్ అత్యంత వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాల ప్రాజెక్టులకు రూ.4,500 కోట్లు ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టే రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మార్చి 28న సమావేశమైన కేబినెట్ 2020 వరకు ‘ఈశాన్య రాష్ట్రాల మండలి’ కింద చేపట్టబోయే వివిధ రకాల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.






మార్చి 2018 ఎకానమీ

ఏప్రిల్ 14 నుంచి గ్రామ్ స్వరాజ్ అభియాన్మోదీ అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు 'గ్రామ్ స్వరాజ్ అభియాన్' నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మార్చి 25న నిర్వహించిన మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. వెనకబడిన కుటుంబానికి చెందిన అంబేడ్కర్ ముందుకెళ్లకుండా చాలా మంది అవహేళన చేశారని.. వారందరి ప్రయత్నాలను అంబేడ్కర్ విఫలం చేసి రాజ్యాంగ నిర్మాతగా నిలిచారన్నారు. దేశం పేదలు, వెనకబడిన వర్గాలకే చెందుతుందని మోదీ చెప్పారు. 


ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలి: అరవింద్ పనగరియా నీతిఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ మినహా మిగిలిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించాలని సూచించారు. 2019లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న అన్ని పార్టీలు ఈ అంశాన్ని ముందుగానే తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రస్తుతం పనగరియా ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణకు కుంభకోణాలు, మొండి బకాయిలు (ఎన్‌పీఏ) పెరిగిపోవడం అన్న ఒక్క కారణం చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కోర్ బ్యాంకింగ్‌తో స్విఫ్ట్ అనుసంధానం 
అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను స్విఫ్ట్‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ విధమైన అనుసంధానం లేకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు నీరవ్‌మోదీ కంపెనీలకు ఎల్‌వోయూల జారీ అంశాన్ని కోర్ బ్యాంకింగ్ (సీబీఎస్) దృష్టికి వెళ్లకుండా స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. ఎల్‌వోయూల జారీ వివరాలను వారు సీబీఎస్‌లో నమోదు చేయలేదు. దీంతో ఈ మోసం చాలా కాలం పాటు బయటపడకుండా కొనసాగింది. ఇక సైబర్ ఇన్సూరెన్‌‌స కూడా తీసుకోవాలని నిర్ణయం జరిగింది. రిస్క్ నిర్వహణపై జరిగిన ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 

2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతమేఫిచ్ 
భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఆర్థిక సంవత్సరం (2018-19)లో 7.3 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. తదుపరి ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇది 7.5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వెల్లడించింది. మౌలిక రంగంలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ఇది సాధ్యమవుతుందని వివరించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ నివేదికలో ఫిచ్ పేర్కొంది. కేంద్ర గణాంకాల శాఖ అంచనా 6.6% కంటే ఇది తక్కువే. 


మరో ఏడాది ప్రభుత్వ బ్యాంకులు’ నష్టాల్లోనే:ఎస్‌అండ్‌పీ 
మొండిబాకీల ప్రక్షాళనలో భాగంగా భారీ కేటాయింపుల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) మరో ఏడాది పాటు నష్టాలే నమోదు చేసే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌‌స సంస్థ అంచనా వేసింది. మొత్తం మీద 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం టర్న్ ఎరౌండ్ కాగలదని పేర్కొంది. ప్రధాన వర్ధమాన మార్కెట్ల బ్యాంకులకు అంతర్జాతీయ ఆర్థిక రికవరీ ఎంత మేర తోడ్పడుతుంది అన్న పేరిట రూపొందించిన నివేదికలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌‌స ఈ అంశాలు వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో ఇటీవలి రూ. 13,000 కోట్ల కుంభకోణం.. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పారదర్శకత లోపాలు, బలహీన గవర్నెన్‌‌స ప్రమాణాలను మరోసారి బహిర్గతం చేశాయని పేర్కొంది. 


రూ. వెయ్యి కోట్ల మేర బ్యాంకులను ముంచిన కనిష్క్ గోల్డ్ 
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ను నిండా ముంచేసిన నీరవ్ మోదీ కుంభకోణం ఘటన మరువకముందే... ఇలాంటివే మరిన్ని స్కామ్‌లు పుట్టగొడుగుల్లా వెలుగుచూస్తున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బంగారు నగల విక్రయ సంస్థ బ్యాంకులకు వందల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు బయటపడింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా మొత్తం 14 బ్యాంకులను దాదాపు రూ.825 కోట్ల మేర మోసం చేసినట్లు వెల్లడైంది. కనిష్క్ గోల్డ్‌పై సీబీఐకి ఈ ఏడాది జనవరిలో ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. 
కనిష్క్ గోల్డ్‌కు భూపేష్ కుమార్ జైన్, ఆయన భార్య నీతా జైన్‌లు ప్రమోటర్, డెరైక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థకు ఎస్‌బీఐ నేతృత్వంలోని 14 ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల కన్సార్షియం ఇచ్చిన రుణాలన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి. ప్రమోటర్లు నకిలీ డాక్యుమెంట్లతో మోసపూరితంగా రుణాలను పొందారని.. ఆ తర్వాత వాటిని ఎగవేసినట్లు సీబీఐకి ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ఫిర్యాదులో ఎస్‌బీఐ పేర్కొంది. కనిష్క్ గోల్డ్ రుణం విషయంలో మోసం జరిగినట్లు గతేడాది నవంబర్ 11న తొలిసారిగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కు ఎస్‌బీఐ తెలియజేసింది.

జాతీయ పౌష్టికాహార మిషన్ ప్రారంభం మార్చి 8న మహిళాదినోత్సవం సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్‌ఎన్‌ఎమ్)ను రాజస్తాన్‌లోని ఝుంఝున్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని 161 జిల్లాల నుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. లింగవివక్ష లేకుండా అందరూ సమానమనే భావనను సమాజం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బాలికల భ్రూణహత్యలు మనం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇంట్లో ఆడపిల్లలను సంరక్షించే బాధ్యతను ఆ బాలిక తల్లి, అత్తగారే తీసుకోవాలని సూచించారు. 
అంతకుముందు, కలెక్టర్లతో సంభాషించిన మోదీ.. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, గుజరాత్, హరియాణా, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. 


421 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు మార్చి 2తో ముగిసిన వారంలో 167.8 మిలియన్ డాలర్ల మేర పెరిగి 420.75 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 1.13 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. 2018 ఫిబ్రవరి 9న విదేశీ మారకం నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 421.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 సెప్టెంబర్‌లో ఫారెక్స్ నిల్వలు తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటగా, అప్పటి నుంచి హెచ్చు, తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. 

ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లు అమలు
అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఎలక్ట్రానిక్-వే బిల్లును ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. పన్ను రిటర్నుల విధానాన్ని మరింత సరళీకరించడంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీ మండలి ప్రస్తుత విధానాన్నే మరో 3 నెలలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. వాణిజ్య సంస్థలు ప్రతినెలా జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-1 అనే 2 రకాల రిటర్నులు ఇస్తున్నాయి. వీటిని సరళీకరించి ఒకే రిటర్ను పత్రాన్ని ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని భావించామనీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడిందని జైట్లీ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న రిటర్నుల విధానాన్నే జూన్ వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. 
కాగా, అంతర్రాష్ట్ర రవాణా కోసం ఈ-వే బిల్లును ప్రభుత్వం ఫిబ్రవరి 1నే అమలు చేయగా ఆ వ్యవస్థలో లోపాలు తలెత్తి సరిగ్గా పనిచేయలేదు. దీంతో తప్పులను సరిదిద్ది అంతర్రాష్ట్ర సరకు రవాణా కోసం ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లులను మళ్లీ తప్పనిసరి చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. 


జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.5 శాతం
ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి మార్చి 12న కేంద్రం గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జనవరిలో 7.5 శాతంగా నమోదయి్యంది (డిసెంబర్‌లో 7.1 శాతం). 2017 జనవరిలో 3.5 శాతం. అయితే పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో భారీగా పెరిగినా, ఆర్థిక సంవత్సరం మొదటి నుంచీ ఇప్పటి వరకూ చూస్తే, నిరాశలోనే ఉంది. వృద్ధి రేటు 5 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 4.4 శాతంగా నమోదయి్యంది. 


ఎల్‌వోయూల జారీపై నిషేధం విధించిన ఆర్బీఐ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) కుంభకోణం జరిగిన నేపథ్యంలో బ్యాంకులు ఎల్‌వోయూలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్‌వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్‌వోసీ)ల జారీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే, దిగుమతులకు సంబంధించి వివిధ సంస్థల రుణ అవసరాల కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీల జారీని బ్యాంకులు యథాప్రకారం కొనసాగించవచ్చు.
పీఎన్‌బీ అధికారులతో కుమ్మకై ్క తీసుకున్న ఎల్‌వోయూల ఆధారంగా వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్ మోదీ 2011 మార్చి నుంచి దాదాపు 1,212 ఎల్‌వోయూలు తీసుకున్నాడు.


టీబీ ఫ్రీ ఇండియా ఉద్యమం ప్రారంభం
క్షయ వ్యాధి రహిత భారత్‌ను సాధించే దిశగా టీబీ ఫ్రీ ఇండియా ప్రచార ఉద్యమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 13న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 2025 నాటికి దేశాన్ని క్షయ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా 2030 నాటికి టీబీని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ మనదేశంలో ఐదేళ్ల ముందుగానే అంటే 2025 నాటికే దీనిని సాధించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు.


భారత్ వృద్ధి రేటు 7.3 శాతం: ప్రపంచ బ్యాంక్
భారత్ వృద్ధి తీరు బాగుందని, వచే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్-2019 మార్చి) భారత్‌వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. 2019-20లో ఈ రేటు 7.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7 శాతంగా నమోదయ్యే వీలుందని తెలిపింది. ఈ మేరకు తన ద్వైవార్షిక పబ్లికేషన్‌లో ఈ వివరాలు వెల్లడించింది. డీమోనిటైజేషన్, వస్తు, సేవల పన్ను ప్రభావాల నుంచి భారత్ రికవరీ అవుతుంది కాబట్టి వృద్ధి తీరు కూడా నెమ్మదిగా రికవరీ అవుతుందని పేర్కొంది.


3వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.2 శాతం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) బాగుంది. 7.2 శాతం వృద్ధి నమోదయి్యంది. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయిలో 5.7 శాతానికి పడిపోగా, రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) కొంచెం కోలుకుని 6.3 శాతంగా నమోదయి్యంది. అయితే ఇప్పుడు ఈ రేటును 6.5 శాతంగా సీఎస్‌ఓ సవరించింది. కీలకమైన వ్యవసాయం, తయారీ, నిర్మాణం, సేవల రంగాల్లో రికవరీ కనిపించడం 3వ త్రైమాసికానికి కలిసి వచ్చింది. భారత్ జీడీపీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతం ఉంటే, తయారీ, వ్యవసాయం రంగాల వాటా దాదాపు చెరి 15 శాతం ఉంది. 
మొత్తంగా 6.6 శాతం ఉండొచ్చు... 
ఆర్థిక సంవత్సరం మొత్తం మీద (2017 ఏప్రిల్- 2018 మార్చి) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం ఉండే అవకాశం ఉందని ఫిబ్రవరి 28న విడుదల చేసిన గణాంకాల సందర్భంగా కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. 
 

2018లో భారత వృద్ధి రేటు 7.6 శాతంమూడీస్ 
అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ 2018 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును 7.6 శాతంగా అంచనా వేసింది. 2016 నాటి డీమోనిటైజేషన్, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకుంటుందని చెప్పటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. 2018 సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాలను మార్పు చేయకుండా గతంలో వెల్లడించిన మేరకు 7.6 శాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. 2019లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రముఖ వర్ధమాన దేశాల్లో భారత్, ఇండోనేషియా దేశాల వృద్ధి అంచనాలను మాత్రమే మార్పు చేయడం లేదని పేర్కొంది. 


ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల వేలానికి ప్రత్యేక చట్టం 
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్‌‌స అధినేత విజయ్ మాల్యా తరహా ఆర్థిక నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించి ‘ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు’కు కేంద్ర కేబినెట్ మార్చి 1న ఆమోదముద్ర వేసింది. మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు, రుణం ఎగవేసి అదృశ్యమైన వారికి సంబంధించి అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని వెంటనే విక్రయించే అధికారం ఈ బిల్లు కల్పిస్తుంది. దీంతో నీరవ్ మోదీ తరహా భారీ కుంభకోణాల్లో ఈ చట్టం ప్రకారం ప్రత్యేక కోర్టు అనుమతితో బకాయిలను తక్షణమే రాబట్టుకునేందుకు వీలు పడుతుంది. ఆర్థిక నేరగాళ్లతోపాటు రూ.100 కోట్లకు పైగా రుణ బకాయి పడి విదేశాలకు పారిపోయిన వారికీ ఇదే వరిస్తుంది. 


అమెరికా నుంచి ఎల్‌ఎన్‌జీ దిగుమతులు
ఇటీవలే అమెరికా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ప్రారంభించిన భారత్... తాజాగా ద్రవీకృత సహజ వాయువును (ఎల్‌ఎన్‌జీ) కూడా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. లూసియానాలోని షెనియర్ ఎనర్జీకి చెందిన సబీన్ పాస్ లిక్విఫాక్షన్ ప్లాంటు నుంచి ఏటా 3.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా కాంట్రాక్టు కుదుర్చుకుంది. 20 ఏళ్ల ఈ డీల్‌లో భాగంగా తొలి కార్గో.. గెయిల్‌కి చెందిన ’మెరీడియన్ స్పిరిట్’ రవాణా నౌక లూసియానా నుంచి భారత్‌కి బయలుదేరింది. ఇది ఈ నెల 28 నాటికి ఇది మహారాష్ట్రలోని దభోల్ టెర్మినల్‌కి చేరుతుందని గెయిల్ తెలిపింది. 2011లో గెయిల్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ గతేడాది అక్టోబర్ నుంచే అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. 


రూ. 1,217 కోట్ల చోక్సీ ఆస్తుల అటాచ్
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీలకు చెందిన రూ. 1,217.2 కోట్ల విలువైన 41 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈ ఆస్తుల్ని అటాచ్ చేశారు. ఈ ఆస్తుల్లో ముంబైలోని 15 ఫ్లాట్లు, 17 కార్యాలయ ప్రాంగణాలు, కోల్‌కతాలోని ఒక మాల్, అలీబాగ్‌లోని 4 ఎకరాల ఫాంహౌస్, నాసిక్, నాగ్‌పూర్, తమిళనాడులోని విల్లుపురంలోని 231 ఎకరాల భూమి ఉన్నాయి. 


మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు 
నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలను ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్న మొత్తం రూ.2,919.55 కోట్లలో ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ,ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్ షేరింగ్ ఉన్న పెట్రోలింగ్ వ్యాన్‌లను, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేస్తారు.

ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు.


2018-19లో భారత వృద్ధి 7.5 శాతం: క్రిసిల్
2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. దేశీయ వినియోగం, విధానాల పరంగా ప్రోత్సాహం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి సానుకూల అంశాలని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) మాత్రం జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 - 7.5 శాతం వరకు ఉండొచ్చని 2018 ఆర్థిక సర్వే సైతం పేర్కొంది. 
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో 10.5 శాతానికి చేరిన స్థూల ఎన్‌పీఏల అంశాన్ని పరిష్కరించకుండా స్థిరమైన ఆర్థికవృద్ధి సాధ్యం కాదని క్రిసిల్ అభిప్రాయపడింది. 


2016-2017లో రూ.81,683 కోట్ల రైటాఫ్జైట్లీ 
2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పీఎస్‌బీలు(ప్రభుత్వ రంగ బ్యాంకులు) రూ.81,683 కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మార్చి 6న రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, బ్యాంకులు పన్ను ప్రయోజనాల కోసం, అదేవిధంగా మూలధన సద్వినియోగం కోసం బ్యాలెన్‌‌స షీట్ రైటాఫ్ కింద చూపిస్తాయని... సంబంధిత రుణ గ్రహీతలు ఈ బకాయిలను తిరిగి చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టం చేశారు. 
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.20,339 కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ చేసినట్లు జైట్లీ తెలియజేశారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో (2017-18) సెప్టెంబర్ వరకూ పీఎస్‌బీలు రూ.28,781 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం నాలుగేళ్లకు పైబడిన మొండి బకాయిలను (పూర్తిస్థాయిలో ప్రొవిజనింగ్ చేసిన వాటితో సహా) బ్యాంకులు వాటి బ్యాలెన్‌‌స షీట్‌ల నుంచి తొలగిస్తాయి. దీన్నే సాంకేతికంగా రైటాఫ్ కింద పరిగణిస్తారు. 
బ్యాంకింగ్ మోసాలుః రూ.52,717 కోట్లు
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2013 ఏప్రిల్ 1 నుంచి) బ్యాంకింగ్ రంగ మోసాలకు సంబంధించి 13,643 కేసులు వెలుగుచూశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా పార్లమెంటులో చెప్పారు. ఈ మోసాల విలువ రూ.57,717 కోట్లుగా ఆయన తెలిపారు. ఇక బినామీ చట్టం-2018 కింద ఇప్పటివరకూ వెయి్యకిపైగా ఆస్తులను ప్రాథమికంగా జప్తు (అటాచ్) చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీటి విలువ రూ.3,800 కోట్లకు పైగానే ఉంటుందని శుక్లా వివరించారు. 



ఫిబ్రవరి 2018 ఎకానమీ

భారత జీడీపీలో 15 శాతానికి కుబేరుల సంపద ప్రభుత్వాల అసమగ్ర విధానాలతో భారత్‌లో గడిచిన మూడు దశాబ్దాల్లో అసమానతలు భారీగా పెరిగిపోయాయి. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కేవలం కొద్ది మంది కుబేరుల వాటా పెరుగుతుండగా.. పేదల వాటా అంతకంతకూ తగ్గిపోతోంది. ఆక్స్‌ఫామ్ ఇండియా విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అయిదేళ్ల క్రితం జీడీపీలో పది శాతానికి పరిమితమైన కుబేరుల సంపద వాటా ప్రస్తుతం ఏకంగా 15 శాతానికి పెరిగిపోయింది. వారసత్వ ఆస్తులతోను, క్రోనీ క్యాపిటలిజం మార్గంలోనూ దేశీయంగా సంపన్నులు భారీ ఎత్తున సంపదను పోగేసుకుంటున్నట్లు ఆక్స్‌ఫామ్ వివరించింది. భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరుగుతుండటానికి.. 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయంలోనూ, ఆ తర్వాత నుంచీ వివిధ ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న విధానాలే కారణమని పేర్కొంది. 2017లో భారత్‌లో 101 మంది బిలియనీర్స్ ఉన్నారు. 


హెల్త్‌కేర్ సేవలకు జీఎస్టీ లేదు ఆస్పత్రుల్లోని రోగులకు వైద్యుల సూచనల మేరకు అందజేసే ఆహారంపై జీఎస్టీ లేదని ప్రభుత్వం తెలిపింది. అనారోగ్యం, గాయం, గర్భం, వంటి కారణాలతో ఆస్పత్రిలో చేరిన వారు చేయించుకునే పరీక్షలు, చికిత్స, వైద్యం వంటివి జీఎస్టీ చట్టం ప్రకారం హెల్త్‌కేర్ సేవల పరిధిలోకి వస్తాయని, వీటిపై పన్ను ఉండదంది. దీంతోపాటు ఆస్పత్రులకు రోగులు చెల్లించే మొత్తం (వైద్యుల ఫీజు సహా)నకు కూడా జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఆస్పత్రిలో అడ్మిట్ కాని రోగులు, వారి సంబంధీకులకిచ్చే ఆహారంపై జీఎస్టీ ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 

టోకు ధరల సూచీ 2.84 శాతంగా నమోదు
టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.84 శాతంగా నమోైదె ంది. దీన్ని బట్టి జనవరి 2017తో పోల్చితే 2018 జనవరి నాటికి టోకు ధరలు 2.84 శాతం మేర పెరిగాయని తెలుస్తుంది. ప్రభుత్వం ఫిబ్రవరి 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆరు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి.

5.07 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి.. 5.07 శాతంగా నమోదైంది. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్రం ఫిబ్రవరి 12న విడుదల చేసింది. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ మధ్యస్థ లక్ష్యమైన 4 శాతం కంటే అధికం. ఆహార, ఇంధన ధరల్లో పెరుగుదల రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుంది.

ఓబీసీలకు 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్
2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఓబీసీలకు రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ వెల్లడించింది. ఈ శాఖకు కేటాయించిన బడ్జెట్ ద్వారా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపింది. గతంతో పోల్చితే ఈసారి కేటాయింపులు 12.10 శాతం పెరిగి రూ. 7,750 కోట్లకు చేరాయంది. వివిధ పథకాలకు 11.57 శాతం కేటాయింపులు పెరగగా, ఓబీసీ సంక్షేమానికి 41.03 శాతం కేటాయింపులు పెరిగాయి. గతేడాది ఎస్సీలకు అమలుచేసిన తరహాలో ఓబీసీలకూ రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.140 కోట్లను 2018-19లో సమకూర్చనుంది. 
మత్తుపదార్థాల బారిన పడ్డ వారి పునరావాసం కోసం తొలిసారిగా జాతీయ సర్వే ద్వారా వారిని గుర్తిస్తారు. ఇందుకోసం 185 జిల్లాల్లో, 1.5 లక్షల కుటుంబాలపై చేస్తున్న సర్వే ఏప్రిల్ నాటికి పూర్తవనుంది. వీరి పునరావాసానికి రూ. 200 కోట్లు కేటాయించనున్నారు.

ఉపకారవేతనం ఆదాయ పరిమితి పెంపు

ఓబీసీ ప్రీమెట్రిక్ సాల్కర్‌షిప్ పొందేందుకు ప్రస్తుతమున్న వార్షికాదాయ పరిమితిని రూ. 44,500 నుంచి రూ. 2.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచింది. డేస్కాలర్లకు స్టైఫండ్‌ను రూ. 225కు, హాస్టల్‌లో ఉండేవారికి రూ. 525కు పెంచింది. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది. స్టైపండ్‌ను స్థానిక విద్యార్థులకు రూ. 2,000కు, ఇతర ప్రాంతాల విద్యార్థులకు రూ.5,000కు పెంచింది. డేస్కాలర్లకు ఒకటి నుంచి పది వరకు అన్ని తరగతులకు ఒకేలా రూ. 100 ఇవ్వనున్నారు. హాస్టల్ విద్యార్థులకు ఇకపై మూడు నుంచి పది వరకు అన్ని తరగతులకు రూ. 500 ఇవ్వనున్నారు. షెడ్యూలు కులాల విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ కింద సాయాన్ని రూ. 28 వేలకు పెంచారు. 


పీఎన్‌బీలో 11,400 కోట్ల కుంభకోణం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో ’భారీ కుంభకోణం’ వెలుగుచూసింది. 1.77 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,346 కోట్లు) మేర ప్రభావం చూపే మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలింది. ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. కొంత మంది ఖాతాదారులతో కుమ్మకై ్కన కొందరు ఉద్యోగులు.. వారికి ప్రయోజనం చేకూర్చేలా మోసపూరిత, అనధికారిక లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. ఈ లావాదేవీల ఆధారంగా.. సదరు కస్టమర్లకు విదేశాల్లో మరికొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లుగా తెలుస్తోందని వివరించింది. దీంతో, వీటి ప్రభావం మరిన్ని బ్యాంకులకు కూడా విస్తరించి ఉండవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారంలో 10 మంది ఉద్యోగులను బ్యాంకు సస్పెండ్ చేసింది. 
మూడేళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఈ తరహాలో దాదాపు రూ. 6,000 కోట్ల కుంభకోణం చోటుచేసుకుంది. 


పీఎన్‌బీ కేసులో 5,100 కోట్ల ఆస్తుల స్వాధీనం 
వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్ని రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ)లు ముమ్మరం చేశాయి. భారతదేశ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు కుంభకోణంగా పేర్కొంటున్న ఈ కేసులో ఫిబ్రవరి 15న ఈడీ భారీ మొత్తంలో ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారుడైన బిలియనీర్, ఆభరణాల డిజైనర్ నీరవ్ మోదీకి చెందిన దుకాణాలు, ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీజ్ చేసింది. 
బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు ఉడాయించిన విజయ్ మాల్యా తరహాలోనే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, సోదరుడు నిశాల్, భార్య అమీ, వ్యాపార భాగస్వామి మోహుల్ చోక్సీలు కూడా కుంభకోణం బయటపడక ముందే విదేశాలకు ఉడాయించారు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) సీబీఐకి ఫిర్యాదు చేయగా.. జనవరి మొదటి వారంలోనే నిందితులంతా దేశం నుంచి జారుకున్నారు. 

2017-18కి మారనున్న గణాంకాల బేస్ ఇయర్ 
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకు ప్రభుత్వం బేస్ ఇయర్‌ను మార్చనుంది. జీడీపీ, ఐఐపీ గణాంకాలకు బేస్ ఇయర్ 2017-18గా మార్చుతున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ వెల్లడించారు. రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్‌ను 2018గా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూడు కీలక ఆర్థిక గణాంకాలకూ 2011-12 బేస్ ఇయర్‌గా ఉంది. ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత లక్ష్యంగా కేంద్రం బేస్ ఇయర్ మార్పు నిర్ణయం తీసుకుంటోందన్నారు. 
2018-19లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖకు కేంద్రం రూ.4,859 కోట్లను కేటాయించింది. 


2018 జనవరిలో ఎగుమతుల వృద్ధి 9% 
భారత్ ఎగుమతులు 2018 జనవరిలో (2017 జనవరితో పోల్చి) 9 శాతం పెరిగాయి. విలువ రూపంలో రూ.24.38 కోట్లుగా నమోదయి్యంది. ఇక ఇదే నెలలో దిగుమతులు 26.1 శాతం పెరిగాయి. విలువ రూపంలో 40.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 16.3 బిలియన్ డాలర్లుగా నమోదయి్యంది. గడచిన మూడేళ్లలో ఈ స్థాయిలో వాణిజ్యలోటు పెరుగుదల ఇదే తొలిసారి. 
కాగా 2017 డిసెంబర్‌లో సేవల ఎగుమతుల విలువ 16 బిలియన్ డాలర్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడించాయి. ఈ విభాగంలో దిగుమతుల విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. సేవల వాణిజ్యలోటు 6 బిలియన్ డాలర్లు. 

2020 నాటికి 10 వేల కోట్లకు భారత ఆన్‌లైన్ మార్కెట్
వినియోగదారులు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2.5 రెట్లు పెరిగి దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. ఈ-కామర్స్, ట్రావెల్ అండ్ హోటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా రంగాల్లోని వృద్ధి దీనికి దోహదపడుతుంది. ఈ విషయాలు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్ సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి. 
నివేదికలోని ముఖ్యాంశాలు..
  • భారతీయులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ల విలువ దాదాపు 4,000 కోట్ల డాలర్లుగా ఉంది.
  • ఈ-కామర్స్ విభాగంలో అప్పరెల్ అండ్ యాక్ససిరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ వంటి ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయాలు 2020 నాటికి ప్రస్తుతమున్న 18 బిలియన్ డాలర్ల నుంచి 40-45 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. అలాగే ట్రావెల్ అండ్ హోటల్ వ్యయాలు 11 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యయాలు 12 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు, డిజిటల్ మీడియా వ్యయాలు 200 మిలియన్ డాలర్ల నుంచి 570 మిలియన్ డాలర్లకు పెరగొచ్చు.
  • 2020 నాటికి మహిళా షాపర్ల సంఖ్య 2.5 రెట్లు పెరగనుంది.
  • భారత్‌లో ఐదుగురు ఇంటర్నెట్ యూజర్లలో ఒకరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసి ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు. ఆరుగురిలో ఒకరు ఆన్‌లైన్‌లో ట్రావెల్ బుకింగ్‌‌స చేసుకుంటున్నారు. దాదాపు 75-80 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయడం లేదు.


రొటొమ్యాక్ కుంభకోణం 3,695 కోట్లు
రూ. 3,695 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని రొటొమ్యాక్ పెన్‌‌స ప్రమోటర్ విక్రమ్ కొఠారి ముంచేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)లు ఫిబ్రవరి 19న వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి. రొటొమ్యాక్ కంపెనీ ఖాతాల పరిశీలన తర్వాత ఆ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ల నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ బ్యాంకుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 2919 కోట్ల రుణాల్ని పొందగా అసలు, వడ్డీ, కలుపుకుంటే ఆ మొత్తం రూ. 3,695 కోట్లుగా ఉంది. 

10 లక్షల కోట్లను మించిపోయిన ఐటీ వార్షికాదాయం
దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వార్షికాదాయం ఏకంగా రూ.10 లక్షల కోట్లను మించిపోయింది. ఎగుమతుల్లో 24 శాతం వాటాతో దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. దేశంలో ఐటీ రంగం పురోగతిపై ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)’రూపొందించిన నివేదికను ఫిబ్రవరి 20న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదికపై విడుదల చేసింది. 
దేశ ఐటీ రంగం 2015-16లో 143 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగా.. 2016-17లో 154 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.98 లక్షల కోట్లు)కు పెంచుకుందని నాస్కామ్ తెలిపింది. ఇది 2017-18లో 167 బిలియన్ డాలర్ల (10.8 లక్షల కోట్లు)కు పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, బీపీఎం వంటి ప్రధాన సేవలు సహా మొత్తంగా ఐటీ రంగానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపింది. లక్షకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది.


4 రాష్ట్రాల్లో 11,661 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం 
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బెంగళూరు-మైసూరు మధ్య జాతీయ రహదారి- 275ను 61 కి.మీ. మేర విస్తరణకు రూ. 2,920 కోట్ల ఖర్చుకు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. ఈ నిధులతో నిడగట్ట-మైసూరు సెక్షన్ మధ్య ఎన్‌హెచ్-275ను ఆరు లేన్లుగా విస్తరిస్తారని ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ తెలిపింది. నాలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రాక్‌ల విద్యుదీకరణ, కొత్త రైల్వే లైన్ కోసం రూ. 11,661 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులు అమలైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో 2 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పించవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.

చార్‌ధామ్ ప్రాజెక్టులో సొరంగానికి పచ్చజెండా 

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిని కలిపే చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా ధారసు- యమునోత్రి మధ్య రూ. 1,384 కోట్లతో సొరంగం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సొరంగం నిర్మాణంతో ఆ రెండు ప్రాంతాల మధ్య 20 కి.మీ. దూరం, గంట ప్రయాణ సమయం తగ్గుతాయి. 

ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్ అనుమతులు 
ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయం చేశాక మళ్లీ ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది బొగ్గు రంగంలో అత్యంత కీలక సంస్కరణ అని సమావేశానంతరం బొగ్గు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశీయంగా 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత సాధించేం దుకు ఈ సంస్కరణలు దోహదపడగలవని తెలిపారు. 
ఈ మేరకు బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్‌‌స) 2015, గనులు.. ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 కింద బొగ్గు గనులు/బ్లాకుల వేలంలో ఉపయోగించే ప్రక్రియను సీసీఈఏ ఆమోదించినట్లు కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
అయిదు బొగ్గు రాష్ట్రాలకు అత్యధిక లబ్ధి ..
బొగ్గు గనుల వేలం, విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అంతా బొగ్గు నిల్వలున్న ఆయా రాష్ట్రాలకే చెందుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్థిక వృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సదరు రాష్ట్రాలు ఈ ఆదాయాలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించింది. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు అత్యధికంగా ప్రయోజనం చేకూరగలదని పేర్కొంది. భారత్‌లో 300 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిలో అత్యధికంగా నిల్వలు అయిదు రాష్ట్రాల్లో.. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు తాజా సంస్కరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి. 


3 కోట్ల ఉచిత ఎల్పీజీకి రూ.4,800 కోట్లుబడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకోసం ప్రకటించిన 3కోట్ల అదనపు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లకు రూ.4,800 కోట్లు అదనంగా ఖర్చుకానుంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 8న ఢిల్లీలో వెల్లడించారు. గతంలో నిర్ణయించినట్లుగానే 5కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు అందజేస్తామని.. ఇప్పటికే 3.36కోట్ల కనెక్షన్లను పేద మహిళలను అందజేశామని తెలిపారు. ఇందుకోసం రూ.8వేల కోట్ల కేటాయింపులు జరిగాయిని చెప్పారు. ఇప్పుడు ఈ పథకాన్ని మరో 3 కోట్లు పెంచాలన్న ప్రకటన నేపథ్యంలో అదనంగా రూ.4,800 కోట్లకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని పేర్కొన్నారు. 


స్మార్ట్ సిటీ పథకానికి 9,940 కోట్లు
స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు, మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశారు.


86 వేల కోట్ల రుణమాఫీ చేసిన పీఎస్‌బీలు
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.81,683 కోట్లను రైటాఫ్ చేశాయని తాజా ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ఇందులో అత్యధికంగా ఎస్‌బీఐ రూ.20 వేల కోట్లకు పైగానే మొండిబాకీలను మాఫీ చేసింది. 2012-13 ఏడాదిలో పీఎస్‌బీలు రైటాఫ్ చేసిన రుణాలు రూ.27,231 కోట్లు.
2016-17లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) రూ.7,346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) రూ.4,348 కోట్ల చొప్పున మొండి బకాయిలను రైటాఫ్ చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18) తొలి ఆరు నెలల కాలంలో(డిసెంబర్ వరకూ) పీఎస్‌బీలు రూ.53,625 కోట్లను రైటాఫ్ చేశాయి.
పీఎస్‌బీల రుణమాఫీ వివరాలు
ఏడాది
రైటాఫ్ మొత్తం
2012-13
రూ.27,231 కోట్లు
2013-14
రూ.34,409 కోట్లు
2014-15
రూ.49,018 కోట్లు
2015-16
రూ.57,585 కోట్లు
2016-17
రూ.81,683 కోట్లు
2017-18
రూ.53,625 కోట్లు (డిసెంబర్ నాటికి)


ప్రపంచ సంపన్న నగరాల్లో ముంబైకి 12వ స్థానందేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచ సంపన్న నగరాల్లో 12వ స్థానంలో నిలిచింది. ముంబై మొత్తం సంపద విలువ 950 బిలియన్ డాలర్లు (రూ.60.8 లక్షల కోట్లు). ఈ మేరకు ప్రపంచంలో 15 సంపన్న నగరాలతో న్యూ వరల్డ్ వెల్త్ ఓ నివేదిక విడుదల చేసింది. ముంబై తర్వాత 944 బిలియన్ డాలర్ల (రూ.50.04 లక్షల కోట్లు)తో టొరంటో, 912 బిలియన్ డాలర్ల(రూ.58.3 లక్షల కోట్లు)తో ఫ్రాంక్‌ఫర్ట్, 860 బిలియన్ డాలర్ల(రూ.54.4 లక్షల కోట్లు)తో పారిస్ అధిక సంపన్న నగరాలుగా జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
ఈ జాబితాలో 3 లక్షల కోట్ల డాలర్లతో (రూ.192 లక్షల కోట్లు) న్యూయార్క్ నగరం మొదటి స్థానంలో ఉంది. రెండు అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఈ నగరంలోనే ఉన్నాయి. 2.7 లక్షల కోట్ల డాలర్ల (రూ.172.8 లక్షల కోట్లు) సంపదతో లండన్ రెండో స్థానంలో ఉండగా 2.5 లక్షల కోట్ల డాలర్ల సంపదతో టోక్యో మూడోస్థానంలో ఉంది.
టాప్-10 నగరాల జాబితా
ర్యాంక్
నగరం
సంపద (లక్షల కోట్ల డాలర్లలో)
1.
న్యూయార్క్
3
2.
లండన్
2.7
3.
టోక్యో
2.5
4.
శాన్‌ఫ్రాన్సిస్కో
2.3
5.
బీజింగ్
2.2
6.
షాంఘై
2
7.
లాస్ ఏంజెలిస్
1.4
8.
హాంకాంగ్
1.3
9.
సిడ్నీ
1
10.
సింగపూర్
1


భారత వృద్ధి రేటు 7.5 శాతం: డాయిష్ బ్యాంక్
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) లో 7.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డాయిష్ బ్యాంక్ తన నివేదికలో విశ్లేషించింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి పెరిగే అవకాశాలు లేకపోవడమే తన విశ్లేషణకు ఆధారమని, ఇది వృద్ధికి దోహదపడే అంశమని పేర్కొంది.
నివేదిక ముఖ్యాంశాలు
  • పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అమల్లో ఇబ్బందులు తత్సంబంధ అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సవాళ్లు తొలగిపోనున్నాయి.
  • అంతర్జాతీయ చమురు ధరల ధోరణి, వర్షపాతం, కనీస మద్దతు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకుల తీవ్రత వంటి అంశాలు వృద్ధికి నిరోధకాలుగా పనిచేయవచ్చు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో భారత్ వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోయింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొంచెం మెరుగుపడి 6.3 శాతంగా ఉంది. అయితే డిసెంబర్, మార్చి త్రైమాసికంలో వృద్ధి మరింత పుంజుకుంటుంది.


ఎన్‌పీఏల పరిష్కారానికి కొత్త మార్గదర్శకాలు
బ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న మొండిబాకీల సమస్యను మరింత వేగవంతంగా పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. మొండిబాకీలుగా మారే ఖాతాలను బ్యాంకులు మరింత ముందుగానే గుర్తించి, సత్వరం తగు చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పలు రుణ పునర్‌వ్యవస్థీకరణ స్కీములను రద్దు చేసింది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న సంస్థ ఖాతా మొండిపద్దుగా మారిన పక్షంలో.. డిఫాల్ట్ అయిన నాటి నుంచి 180 రోజుల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే దివాలా చట్టం కింద సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించే బ్యాంకులపై జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. 


దేశంలో 1.6 లక్షలకు చేరిన కుబేరుల సంఖ్య 
దేశీయంగా సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2017లో అత్యంత సంపన్న కుటుంబాల సంఖ్య 1.60 లక్షల పైకి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. అయితే, వీరి ఉమ్మడి సంపద మాత్రం సుమారు అయిదు శాతమే వృద్ధి చెంది.. రూ. 153 లక్షల కోట్లుగా నమోదైంది. కోటక్ వెల్త్ మేనేజ్‌మెంట్ తరఫున అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు రూ. 25 కోట్ల పైగా సంపద ఉన్న కుటుంబాలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే అయిదేళ్లలో సంపన్న కుటుంబాల సంఖ్య 3.30 లక్షలకు, నికర సంపద విలువ రూ. 352 లక్షల కోట్లకు చేరవచ్చని అధ్యయనంలో అంచనా వేశారు.
 

కీలక వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7న ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. ఇందులో కీలకమైన రెపో రేటును 6 శాతంగా; రివర్స్ రెపో రేటును 5.75 శాతంగా కొనసాగించింది.

జీడీపీ గణాంకాలను సవరించిన కేంద్రం భారత్ 2015-16, 2016-17 స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు సంబంధించి లెక్కలను మరింత మదింపుచేస్తూ, కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) జనవరి 31న ప్రకటన చేసింది. దీని ప్రకారం.. 2015-16 జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. 2016-17 వృద్ధి రేటు యథాతథంగా 7.1 శాతంగా ఉంది. ఈ రెండేళ్లకు సంబంధించి జీడీపీ విలువలు వరుసగా రూ.113.86 లక్షల కోట్లు, రూ.121.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం
దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు (భారత జనాభాలో దాదాపు 40 శాతం) వైద్య ఖర్చుల కవరేజ్ అందించేందుకు ఉద్దేశించిన ‘మోదీ కేర్’ లేదా జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆగస్టు 15 లేదా, గాంధీ జయంతి (అక్టోబర్ 2)నాడు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. దీనికయ్యే ఖర్చును 60 శాతం కేంద్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 2018-19 కేంద్ర బడ్జెట్‌లో దీనికోసం రూ.2 వేల కోట్లతో మూలనిధిని ఏర్పాటు చేశారు. ఈ వైద్య పథకం రీ-ఇంబర్స్‌మెంట్ కాకుండా క్యాష్‌లెస్ విధానంలో ఉండనుంది.


సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారత్ 
2017లో భారత్ నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్లారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు భారత్ వాసులను ఆకర్షించిన టాప్ దేశాలు. 
నివేదికలోని కీలక అంశాలు... 
- 2017లో 10,000 మంది చైనీయులు ఆ దేశం వీడి వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానంలో భారత్ ఉంది. టర్కీ 6,000 మంది, బ్రిటన్ 4,000 మంది, ఫ్రాన్‌‌స 4,000 మంది, రష్యా 3,000 మంది మిలియనీర్లను కోల్పోయాయి. మిలియనీర్ల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది. 
- మిలియనీర్లను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో మరోసారి ఆస్ట్రేలియా కంటే వెనుకబడింది. అయితే, మొత్తం మీద మిలియనీర్ల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి. 


భారత జీడీపీ వృద్ధి రేటుపై మెరిల్‌లించ్ అంచనా 
రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత జీడీపీ 7.5 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని, దీనికి తక్కువ బేస్ కారణమని, ఆ తర్వాతి ఆరు నెలల్లో 7 శాతానికి తగ్గిపోతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ పేర్కొంది. వృద్ధి రేటు పుంజుకున్నా గానీ, వాస్తవ సామర్థ్యం కంటే ఒక శాతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలతో వృద్ధి కనిష్టానికి (తక్కువ బేస్) చేరినందున 2018-19 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో జీడీపీ 7.5 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. 


ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 
రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 3న అసోంలోని గువహటిలోప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, 16 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.