భారత జీడీపీలో 15 శాతానికి కుబేరుల సంపద ప్రభుత్వాల అసమగ్ర విధానాలతో భారత్‌లో గడిచిన మూడు దశాబ్దాల్లో అసమానతలు భారీగా పెరిగిపోయాయి. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కేవలం కొద్ది మంది కుబేరుల వాటా పెరుగుతుండగా.. పేదల వాటా అంతకంతకూ తగ్గిపోతోంది. ఆక్స్‌ఫామ్ ఇండియా విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అయిదేళ్ల క్రితం జీడీపీలో పది శాతానికి పరిమితమైన కుబేరుల సంపద వాటా ప్రస్తుతం ఏకంగా 15 శాతానికి పెరిగిపోయింది. వారసత్వ ఆస్తులతోను, క్రోనీ క్యాపిటలిజం మార్గంలోనూ దేశీయంగా సంపన్నులు భారీ ఎత్తున సంపదను పోగేసుకుంటున్నట్లు ఆక్స్‌ఫామ్ వివరించింది. భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరుగుతుండటానికి.. 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయంలోనూ, ఆ తర్వాత నుంచీ వివిధ ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న విధానాలే కారణమని పేర్కొంది. 2017లో భారత్‌లో 101 మంది బిలియనీర్స్ ఉన్నారు.
హెల్త్‌కేర్ సేవలకు జీఎస్టీ లేదు ఆస్పత్రుల్లోని రోగులకు వైద్యుల సూచనల మేరకు అందజేసే ఆహారంపై జీఎస్టీ లేదని ప్రభుత్వం తెలిపింది. అనారోగ్యం, గాయం, గర్భం, వంటి కారణాలతో ఆస్పత్రిలో చేరిన వారు చేయించుకునే పరీక్షలు, చికిత్స, వైద్యం వంటివి జీఎస్టీ చట్టం ప్రకారం హెల్త్‌కేర్ సేవల పరిధిలోకి వస్తాయని, వీటిపై పన్ను ఉండదంది. దీంతోపాటు ఆస్పత్రులకు రోగులు చెల్లించే మొత్తం (వైద్యుల ఫీజు సహా)నకు కూడా జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఆస్పత్రిలో అడ్మిట్ కాని రోగులు, వారి సంబంధీకులకిచ్చే ఆహారంపై జీఎస్టీ ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
టోకు ధరల సూచీ 2.84 శాతంగా నమోదు
టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.84 శాతంగా నమోైదె ంది. దీన్ని బట్టి జనవరి 2017తో పోల్చితే 2018 జనవరి నాటికి టోకు ధరలు 2.84 శాతం మేర పెరిగాయని తెలుస్తుంది. ప్రభుత్వం ఫిబ్రవరి 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆరు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి.
5.07 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి.. 5.07 శాతంగా నమోదైంది. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్రం ఫిబ్రవరి 12న విడుదల చేసింది. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ మధ్యస్థ లక్ష్యమైన 4 శాతం కంటే అధికం. ఆహార, ఇంధన ధరల్లో పెరుగుదల రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుంది.
ఓబీసీలకు 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్
2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఓబీసీలకు రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ వెల్లడించింది. ఈ శాఖకు కేటాయించిన బడ్జెట్ ద్వారా చేపట్టనున్న పనుల వివరాలు తెలిపింది. గతంతో పోల్చితే ఈసారి కేటాయింపులు 12.10 శాతం పెరిగి రూ. 7,750 కోట్లకు చేరాయంది. వివిధ పథకాలకు 11.57 శాతం కేటాయింపులు పెరగగా, ఓబీసీ సంక్షేమానికి 41.03 శాతం కేటాయింపులు పెరిగాయి. గతేడాది ఎస్సీలకు అమలుచేసిన తరహాలో ఓబీసీలకూ రూ. 200 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.140 కోట్లను 2018-19లో సమకూర్చనుంది.
మత్తుపదార్థాల బారిన పడ్డ వారి పునరావాసం కోసం తొలిసారిగా జాతీయ సర్వే ద్వారా వారిని గుర్తిస్తారు. ఇందుకోసం 185 జిల్లాల్లో, 1.5 లక్షల కుటుంబాలపై చేస్తున్న సర్వే ఏప్రిల్ నాటికి పూర్తవనుంది. వీరి పునరావాసానికి రూ. 200 కోట్లు కేటాయించనున్నారు.
ఉపకారవేతనం ఆదాయ పరిమితి పెంపు
ఓబీసీ ప్రీమెట్రిక్ సాల్కర్‌షిప్ పొందేందుకు ప్రస్తుతమున్న వార్షికాదాయ పరిమితిని రూ. 44,500 నుంచి రూ. 2.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచింది. డేస్కాలర్లకు స్టైఫండ్‌ను రూ. 225కు, హాస్టల్లో ఉండేవారికి రూ. 525కు పెంచింది. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఎస్సీలకు వార్షికాదాయ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది. స్టైపండ్‌ను స్థానిక విద్యార్థులకు రూ. 2,000కు, ఇతర ప్రాంతాల విద్యార్థులకు రూ.5,000కు పెంచింది. డేస్కాలర్లకు ఒకటి నుంచి పది వరకు అన్ని తరగతులకు ఒకేలా రూ. 100 ఇవ్వనున్నారు. హాస్టల్ విద్యార్థులకు ఇకపై మూడు నుంచి పది వరకు అన్ని తరగతులకు రూ. 500 ఇవ్వనున్నారు. షెడ్యూలు కులాల విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ కింద సాయాన్ని రూ. 28 వేలకు పెంచారు.
పీఎన్బీలో 11,400 కోట్ల కుంభకోణం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ’భారీ కుంభకోణం’ వెలుగుచూసింది. 1.77 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,346 కోట్లు) మేర ప్రభావం చూపే మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలింది. ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్బీ వెల్లడించింది. కొంత మంది ఖాతాదారులతో కుమ్మకై ్కన కొందరు ఉద్యోగులు.. వారికి ప్రయోజనం చేకూర్చేలా మోసపూరిత, అనధికారిక లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. ఈ లావాదేవీల ఆధారంగా.. సదరు కస్టమర్లకు విదేశాల్లో మరికొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లుగా తెలుస్తోందని వివరించింది. దీంతో, వీటి ప్రభావం మరిన్ని బ్యాంకులకు కూడా విస్తరించి ఉండవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారంలో 10 మంది ఉద్యోగులను బ్యాంకు సస్పెండ్ చేసింది.
మూడేళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఈ తరహాలో దాదాపు రూ. 6,000 కోట్ల కుంభకోణం చోటుచేసుకుంది.
పీఎన్బీ కేసులో 5,100 కోట్ల ఆస్తుల స్వాధీనం
వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్ని రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో దర్యాప్తును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)లు ముమ్మరం చేశాయి. భారతదేశ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు కుంభకోణంగా పేర్కొంటున్న ఈ కేసులో ఫిబ్రవరి 15న ఈడీ భారీ మొత్తంలో ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారుడైన బిలియనీర్, ఆభరణాల డిజైనర్ నీరవ్ మోదీకి చెందిన దుకాణాలు, ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీజ్ చేసింది.
బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు ఉడాయించిన విజయ్ మాల్యా తరహాలోనే.. ఈ కేసులో నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, సోదరుడు నిశాల్, భార్య అమీ, వ్యాపార భాగస్వామి మోహుల్ చోక్సీలు కూడా కుంభకోణం బయటపడక ముందే విదేశాలకు ఉడాయించారు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) సీబీఐకి ఫిర్యాదు చేయగా.. జనవరి మొదటి వారంలోనే నిందితులంతా దేశం నుంచి జారుకున్నారు.
2017-18కి మారనున్న గణాంకాల బేస్ ఇయర్
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకు ప్రభుత్వం బేస్ ఇయర్‌ను మార్చనుంది. జీడీపీ, ఐఐపీ గణాంకాలకు బేస్ ఇయర్ 2017-18గా మార్చుతున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ వెల్లడించారు. రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్‌ను 2018గా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూడు కీలక ఆర్థిక గణాంకాలకూ 2011-12 బేస్ ఇయర్‌గా ఉంది. ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత లక్ష్యంగా కేంద్రం బేస్ ఇయర్ మార్పు నిర్ణయం తీసుకుంటోందన్నారు.
2018-19లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖకు కేంద్రం రూ.4,859 కోట్లను కేటాయించింది.
2018 జనవరిలో ఎగుమతుల వృద్ధి 9%
భారత్ ఎగుమతులు 2018 జనవరిలో (2017 జనవరితో పోల్చి) 9 శాతం పెరిగాయి. విలువ రూపంలో రూ.24.38 కోట్లుగా నమోదయి్యంది. ఇక ఇదే నెలలో దిగుమతులు 26.1 శాతం పెరిగాయి. విలువ రూపంలో 40.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 16.3 బిలియన్ డాలర్లుగా నమోదయి్యంది. గడచిన మూడేళ్లలో ఈ స్థాయిలో వాణిజ్యలోటు పెరుగుదల ఇదే తొలిసారి.
కాగా 2017 డిసెంబర్లో సేవల ఎగుమతుల విలువ 16 బిలియన్ డాలర్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడించాయి. ఈ విభాగంలో దిగుమతుల విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. సేవల వాణిజ్యలోటు 6 బిలియన్ డాలర్లు.
2020 నాటికి 10 వేల కోట్లకు భారత ఆన్లైన్ మార్కెట్
వినియోగదారులు ఆన్లైన్లో జరిపే కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2.5 రెట్లు పెరిగి దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. ఈ-కామర్స్, ట్రావెల్ అండ్ హోటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా రంగాల్లోని వృద్ధి దీనికి దోహదపడుతుంది. ఈ విషయాలు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్ సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- భారతీయులు ప్రస్తుతం ఆన్లైన్లో జరిపే కొనుగోళ్ల విలువ దాదాపు 4,000 కోట్ల డాలర్లుగా ఉంది.
- ఈ-కామర్స్ విభాగంలో అప్పరెల్ అండ్ యాక్ససిరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ వంటి ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయాలు 2020 నాటికి ప్రస్తుతమున్న 18 బిలియన్ డాలర్ల నుంచి 40-45 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. అలాగే ట్రావెల్ అండ్ హోటల్ వ్యయాలు 11 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యయాలు 12 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు, డిజిటల్ మీడియా వ్యయాలు 200 మిలియన్ డాలర్ల నుంచి 570 మిలియన్ డాలర్లకు పెరగొచ్చు.
- 2020 నాటికి మహిళా షాపర్ల సంఖ్య 2.5 రెట్లు పెరగనుంది.
- భారత్‌లో ఐదుగురు ఇంటర్నెట్ యూజర్లలో ఒకరు ఆన్లైన్లో షాపింగ్ చేసి ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు. ఆరుగురిలో ఒకరు ఆన్లైన్లో ట్రావెల్ బుకింగ్స చేసుకుంటున్నారు. దాదాపు 75-80 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికీ ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం లేదు.
రొటొమ్యాక్ కుంభకోణం 3,695 కోట్లు
రూ. 3,695 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని రొటొమ్యాక్ పెన్స ప్రమోటర్ విక్రమ్ కొఠారి ముంచేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆ మేరకు కొఠారీ అండ్ కో పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)లు ఫిబ్రవరి 19న వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించాయి. రొటొమ్యాక్ కంపెనీ ఖాతాల పరిశీలన తర్వాత ఆ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ల నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకుని స్వప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ బ్యాంకుల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో రూ. 2919 కోట్ల రుణాల్ని పొందగా అసలు, వడ్డీ, కలుపుకుంటే ఆ మొత్తం రూ. 3,695 కోట్లుగా ఉంది.
10 లక్షల కోట్లను మించిపోయిన ఐటీ వార్షికాదాయం
దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వార్షికాదాయం ఏకంగా రూ.10 లక్షల కోట్లను మించిపోయింది. ఎగుమతుల్లో 24 శాతం వాటాతో దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. దేశంలో ఐటీ రంగం పురోగతిపై ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)’రూపొందించిన నివేదికను ఫిబ్రవరి 20న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదికపై విడుదల చేసింది.
దేశ ఐటీ రంగం 2015-16లో 143 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగా.. 2016-17లో 154 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.98 లక్షల కోట్లు)కు పెంచుకుందని నాస్కామ్ తెలిపింది. ఇది 2017-18లో 167 బిలియన్ డాలర్ల (10.8 లక్షల కోట్లు)కు పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బీపీఎం వంటి ప్రధాన సేవలు సహా మొత్తంగా ఐటీ రంగానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపింది. లక్షకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది.
4 రాష్ట్రాల్లో 11,661 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బెంగళూరు-మైసూరు మధ్య జాతీయ రహదారి- 275ను 61 కి.మీ. మేర విస్తరణకు రూ. 2,920 కోట్ల ఖర్చుకు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. ఈ నిధులతో నిడగట్ట-మైసూరు సెక్షన్ మధ్య ఎన్‌హెచ్-275ను ఆరు లేన్లుగా విస్తరిస్తారని ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ తెలిపింది. నాలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రాక్‌ల విద్యుదీకరణ, కొత్త రైల్వే లైన్ కోసం రూ. 11,661 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులు అమలైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో 2 కోట్ల పనిదినాల మేర ఉపాధి కల్పించవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.
చార్ధామ్ ప్రాజెక్టులో సొరంగానికి పచ్చజెండా
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిని కలిపే చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా ధారసు- యమునోత్రి మధ్య రూ. 1,384 కోట్లతో సొరంగం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సొరంగం నిర్మాణంతో ఆ రెండు ప్రాంతాల మధ్య 20 కి.మీ. దూరం, గంట ప్రయాణ సమయం తగ్గుతాయి.
ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్ అనుమతులు
ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయం చేశాక మళ్లీ ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది బొగ్గు రంగంలో అత్యంత కీలక సంస్కరణ అని సమావేశానంతరం బొగ్గు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశీయంగా 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత సాధించేం దుకు ఈ సంస్కరణలు దోహదపడగలవని తెలిపారు.
ఈ మేరకు బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్‌స) 2015, గనులు.. ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 కింద బొగ్గు గనులు/బ్లాకుల వేలంలో ఉపయోగించే ప్రక్రియను సీసీఈఏ ఆమోదించినట్లు కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అయిదు బొగ్గు రాష్ట్రాలకు అత్యధిక లబ్ధి ..
బొగ్గు గనుల వేలం, విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అంతా బొగ్గు నిల్వలున్న ఆయా రాష్ట్రాలకే చెందుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్థిక వృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సదరు రాష్ట్రాలు ఈ ఆదాయాలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించింది. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు అత్యధికంగా ప్రయోజనం చేకూరగలదని పేర్కొంది. భారత్‌లో 300 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిలో అత్యధికంగా నిల్వలు అయిదు రాష్ట్రాల్లో.. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు తాజా సంస్కరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి.
3 కోట్ల ఉచిత ఎల్పీజీకి రూ.4,800 కోట్లుబడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకోసం ప్రకటించిన 3కోట్ల అదనపు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లకు రూ.4,800 కోట్లు అదనంగా ఖర్చుకానుంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 8న ఢిల్లీలో వెల్లడించారు. గతంలో నిర్ణయించినట్లుగానే 5కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు అందజేస్తామని.. ఇప్పటికే 3.36కోట్ల కనెక్షన్లను పేద మహిళలను అందజేశామని తెలిపారు. ఇందుకోసం రూ.8వేల కోట్ల కేటాయింపులు జరిగాయిని చెప్పారు. ఇప్పుడు ఈ పథకాన్ని మరో 3 కోట్లు పెంచాలన్న ప్రకటన నేపథ్యంలో అదనంగా రూ.4,800 కోట్లకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీ పథకానికి 9,940 కోట్లు
స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు, మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశారు.
86 వేల కోట్ల రుణమాఫీ చేసిన పీఎస్‌బీలు
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.81,683 కోట్లను రైటాఫ్ చేశాయని తాజా ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ఇందులో అత్యధికంగా ఎస్బీఐ రూ.20 వేల కోట్లకు పైగానే మొండిబాకీలను మాఫీ చేసింది. 2012-13 ఏడాదిలో పీఎస్‌బీలు రైటాఫ్ చేసిన రుణాలు రూ.27,231 కోట్లు.
2016-17లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) రూ.7,346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) రూ.4,348 కోట్ల చొప్పున మొండి బకాయిలను రైటాఫ్ చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18) తొలి ఆరు నెలల కాలంలో(డిసెంబర్ వరకూ) పీఎస్‌బీలు రూ.53,625 కోట్లను రైటాఫ్ చేశాయి.
పీఎస్‌బీల రుణమాఫీ వివరాలు
ఏడాది
|
రైటాఫ్ మొత్తం
|
2012-13
|
రూ.27,231 కోట్లు
|
2013-14
|
రూ.34,409 కోట్లు
|
2014-15
|
రూ.49,018 కోట్లు
|
2015-16
|
రూ.57,585 కోట్లు
|
2016-17
|
రూ.81,683 కోట్లు
|
2017-18
|
రూ.53,625 కోట్లు (డిసెంబర్ నాటికి)
|
ప్రపంచ సంపన్న నగరాల్లో ముంబైకి 12వ స్థానందేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచ సంపన్న నగరాల్లో 12వ స్థానంలో నిలిచింది. ముంబై మొత్తం సంపద విలువ 950 బిలియన్ డాలర్లు (రూ.60.8 లక్షల కోట్లు). ఈ మేరకు ప్రపంచంలో 15 సంపన్న నగరాలతో న్యూ వరల్డ్ వెల్త్ ఓ నివేదిక విడుదల చేసింది. ముంబై తర్వాత 944 బిలియన్ డాలర్ల (రూ.50.04 లక్షల కోట్లు)తో టొరంటో, 912 బిలియన్ డాలర్ల(రూ.58.3 లక్షల కోట్లు)తో ఫ్రాంక్ఫర్ట్, 860 బిలియన్ డాలర్ల(రూ.54.4 లక్షల కోట్లు)తో పారిస్ అధిక సంపన్న నగరాలుగా జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
ఈ జాబితాలో 3 లక్షల కోట్ల డాలర్లతో (రూ.192 లక్షల కోట్లు) న్యూయార్క్ నగరం మొదటి స్థానంలో ఉంది. రెండు అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్లు ఈ నగరంలోనే ఉన్నాయి. 2.7 లక్షల కోట్ల డాలర్ల (రూ.172.8 లక్షల కోట్లు) సంపదతో లండన్ రెండో స్థానంలో ఉండగా 2.5 లక్షల కోట్ల డాలర్ల సంపదతో టోక్యో మూడోస్థానంలో ఉంది.
టాప్-10 నగరాల జాబితా
ర్యాంక్
|
నగరం
|
సంపద (లక్షల కోట్ల డాలర్లలో)
|
1.
|
న్యూయార్క్
|
3
|
2.
|
లండన్
|
2.7
|
3.
|
టోక్యో
|
2.5
|
4.
|
శాన్ఫ్రాన్సిస్కో
|
2.3
|
5.
|
బీజింగ్
|
2.2
|
6.
|
షాంఘై
|
2
|
7.
|
లాస్ ఏంజెలిస్
|
1.4
|
8.
|
హాంకాంగ్
|
1.3
|
9.
|
సిడ్నీ
|
1
|
10.
|
సింగపూర్
|
1
|
భారత వృద్ధి రేటు 7.5 శాతం: డాయిష్ బ్యాంక్
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) లో 7.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డాయిష్ బ్యాంక్ తన నివేదికలో విశ్లేషించింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి పెరిగే అవకాశాలు లేకపోవడమే తన విశ్లేషణకు ఆధారమని, ఇది వృద్ధికి దోహదపడే అంశమని పేర్కొంది.
నివేదిక ముఖ్యాంశాలు
- పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అమల్లో ఇబ్బందులు తత్సంబంధ అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సవాళ్లు తొలగిపోనున్నాయి.
- అంతర్జాతీయ చమురు ధరల ధోరణి, వర్షపాతం, కనీస మద్దతు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకుల తీవ్రత వంటి అంశాలు వృద్ధికి నిరోధకాలుగా పనిచేయవచ్చు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో భారత్ వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోయింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొంచెం మెరుగుపడి 6.3 శాతంగా ఉంది. అయితే డిసెంబర్, మార్చి త్రైమాసికంలో వృద్ధి మరింత పుంజుకుంటుంది.
ఎన్పీఏల పరిష్కారానికి కొత్త మార్గదర్శకాలు
బ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న మొండిబాకీల సమస్యను మరింత వేగవంతంగా పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. మొండిబాకీలుగా మారే ఖాతాలను బ్యాంకులు మరింత ముందుగానే గుర్తించి, సత్వరం తగు చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పలు రుణ పునర్వ్యవస్థీకరణ స్కీములను రద్దు చేసింది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న సంస్థ ఖాతా మొండిపద్దుగా మారిన పక్షంలో.. డిఫాల్ట్ అయిన నాటి నుంచి 180 రోజుల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే దివాలా చట్టం కింద సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించే బ్యాంకులపై జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది.
దేశంలో 1.6 లక్షలకు చేరిన కుబేరుల సంఖ్య
దేశీయంగా సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2017లో అత్యంత సంపన్న కుటుంబాల సంఖ్య 1.60 లక్షల పైకి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం అధికం. అయితే, వీరి ఉమ్మడి సంపద మాత్రం సుమారు అయిదు శాతమే వృద్ధి చెంది.. రూ. 153 లక్షల కోట్లుగా నమోదైంది. కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ తరఫున అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు రూ. 25 కోట్ల పైగా సంపద ఉన్న కుటుంబాలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే అయిదేళ్లలో సంపన్న కుటుంబాల సంఖ్య 3.30 లక్షలకు, నికర సంపద విలువ రూ. 352 లక్షల కోట్లకు చేరవచ్చని అధ్యయనంలో అంచనా వేశారు.
కీలక వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7న ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. ఇందులో కీలకమైన రెపో రేటును 6 శాతంగా; రివర్స్ రెపో రేటును 5.75 శాతంగా కొనసాగించింది.
జీడీపీ గణాంకాలను సవరించిన కేంద్రం భారత్ 2015-16, 2016-17 స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు సంబంధించి లెక్కలను మరింత మదింపుచేస్తూ, కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) జనవరి 31న ప్రకటన చేసింది. దీని ప్రకారం.. 2015-16 జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. 2016-17 వృద్ధి రేటు యథాతథంగా 7.1 శాతంగా ఉంది. ఈ రెండేళ్లకు సంబంధించి జీడీపీ విలువలు వరుసగా రూ.113.86 లక్షల కోట్లు, రూ.121.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.
జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం
దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు (భారత జనాభాలో దాదాపు 40 శాతం) వైద్య ఖర్చుల కవరేజ్ అందించేందుకు ఉద్దేశించిన ‘మోదీ కేర్’ లేదా జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆగస్టు 15 లేదా, గాంధీ జయంతి (అక్టోబర్ 2)నాడు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. దీనికయ్యే ఖర్చును 60 శాతం కేంద్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 2018-19 కేంద్ర బడ్జెట్లో దీనికోసం రూ.2 వేల కోట్లతో మూలనిధిని ఏర్పాటు చేశారు. ఈ వైద్య పథకం రీ-ఇంబర్స్మెంట్ కాకుండా క్యాష్‌లెస్ విధానంలో ఉండనుంది.
సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారత్
2017లో భారత్ నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్లారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు భారత్ వాసులను ఆకర్షించిన టాప్ దేశాలు.
నివేదికలోని కీలక అంశాలు...
- 2017లో 10,000 మంది చైనీయులు ఆ దేశం వీడి వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానంలో భారత్ ఉంది. టర్కీ 6,000 మంది, బ్రిటన్ 4,000 మంది, ఫ్రాన్స 4,000 మంది, రష్యా 3,000 మంది మిలియనీర్లను కోల్పోయాయి. మిలియనీర్ల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది.
- మిలియనీర్లను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో మరోసారి ఆస్ట్రేలియా కంటే వెనుకబడింది. అయితే, మొత్తం మీద మిలియనీర్ల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి.
భారత జీడీపీ వృద్ధి రేటుపై మెరిల్లించ్ అంచనా
రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత జీడీపీ 7.5 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని, దీనికి తక్కువ బేస్ కారణమని, ఆ తర్వాతి ఆరు నెలల్లో 7 శాతానికి తగ్గిపోతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ పేర్కొంది. వృద్ధి రేటు పుంజుకున్నా గానీ, వాస్తవ సామర్థ్యం కంటే ఒక శాతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలతో వృద్ధి కనిష్టానికి (తక్కువ బేస్) చేరినందున 2018-19 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో జీడీపీ 7.5 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది.
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 3న అసోంలోని గువహటిలోప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, 16 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.